ఉద్రిక్తంగా విద్యాసంస్థల బంద్.. కరీంనగర్ లో స్టూడెంట్ లీడర్ల ర్యాలీ

ఉద్రిక్తంగా విద్యాసంస్థల బంద్.. కరీంనగర్ లో స్టూడెంట్ లీడర్ల ర్యాలీ
  • అడ్డుకున్న పోలీసులు, పలువురు అరెస్ట్

కరీంనగర్, వెలుగు : విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ లో లెఫ్ట్ స్టూడెంట్స్ యూనియన్స్ చేపట్టిన బంద్ ఉద్రిక్తతంగా మారింది. విద్యాసంస్థలను బంద్ చేసిన ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్బీ, ఏఐఎఫ్ డీఎస్ లీడర్లు కరీంనగర్ పట్టణంలోని గీతా భవన్ చౌరస్తా నుంచి విద్యార్థులతో బైక్ ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 

పోలీసులు లాఠీచార్జీ చేయడంతో పాటు ఏఐఎస్ఎఫ్​రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డితో పాటు ఇతర నాయకులను అదుపులోకి తీసుకొని పీటీసీకి తరలించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పీడీఎస్ యూ రాష్ట్ర నాయకుడు రాణా ప్రతాప్ చేతికి గాయమైంది. అనంతరం ఏఐఎస్ఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యావ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని  ఎదుర్కుంటోందని, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కొరతతో పాటు మౌలిక వసతుల లేమి, హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. 

స్కాలర్‌‌షిప్‌‌లు, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ బకాయిలకు తోడు ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో పీడీఎస్ యూ జిల్లా కార్యదర్శులు రామప్రతాప్, అంగడి కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్, ఏఐఎఫ్ డీఎస్ జిల్లా కార్యదర్శి గడ్డం శ్రీకాంత్ పాల్గొన్నారు.