- గుండెపోటుతో జైలులోనే మృతి
కోనరావుపేట, వెలుగు : ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన వ్యక్తి వీసా గడువు ముగిసినా అక్కడే ఉండడంతో పోలీసులు అరెస్ట్ చేయగా.. గుండె పోటుతో జైలులో చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే... సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆసరి వెంకటేశ్వర్లు (40) మూడేండ్ల కింద ఒమన్ దేశం వెళ్లాడు.
వీసా గడువు ముగిసిపోయినప్పటికీ అక్కడే ఉంటూ పనిచేసుకుంటున్నాడు. దీంతో జూన్ 16న అక్కడి పోలీసులు పట్టుకొని మస్కట్ జైలుకు తరలించారు. జైలులో ఉండగానే జూన్ 25న గుండెపోటు రావడంతో పోలీసులు హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.
ఈ విషయం అక్కడి బంధువుల ద్వారా ఆలస్యంగా ధర్మారంలోని కుటుంబ సభ్యులకు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించి తన భర్త డెడ్ బాడీని గ్రామానికి రప్పించేలా చూడాలని వెంకటేశ్వర్లు భార్య పుష్పలత కోరారు.
