కుమారుడితో కలిసి భర్తను చంపిన భార్య .. పెద్దపల్లి జిల్లా తుర్కకాశీపల్లిలో ఘటన

కుమారుడితో కలిసి  భర్తను చంపిన భార్య .. పెద్దపల్లి జిల్లా తుర్కకాశీపల్లిలో ఘటన

సుల్తానాబాద్, వెలుగు : కుటుంబ కలహాల కారణంగా కుమారుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని తుర్క కాశీపల్లిలో శుక్రవారం జరిగింది. ఎస్సై చంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం... తుర్కకాశీపల్లికి చెందిన సయ్యద్ గోరేమియా (40), గోరేబీ భార్యాభర్తలు. ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. 

గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా గొడవలు ఆగలేదు. ఈ నేపథ్యంలో గోరేమియా రెండు నెలల కింద జగిత్యాల జిల్లా మెట్ పల్లికి వెళ్లి అక్కడే ఉంటున్నాడు. మూడు రోజుల కింద కాశీపల్లికి వచ్చి తన తల్లి ఇంట్లో ఉంటున్నాడు. గురువారం రాత్రి భార్యాపిల్లలు ఉంటున్న ఇంటికి వెళ్లగా... దంపతుల మధ్య గొడవ జరిగింది. 

తాను ఇంట్లో నుంచి వెళ్లేది లేదని, ఇక్కడే ఉంటానని గోరేమియా పట్టుబట్టడంతో భార్య గోరేబీ, కొడుకు సయ్యద్ అలీ కలిసి బండరాయితో దాడి చేయగా స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం వారిద్దరూ బంధువుల ఇంటికి వెళ్లగా... గోరేమియా అక్కడే పడుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున స్థానికులు చూసే సరికే అతడు చనిపోయి కనిపించాడు. మృతుడి తండ్రి మస్తాన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.