పోలీసులను నమ్మినందుకు నాపైనే నిందలేశారు.. ‘కరూర్’ మరణాలపై తమిళనాడు సీఎం విజయ్...

పోలీసులను నమ్మినందుకు నాపైనే నిందలేశారు.. ‘కరూర్’ మరణాలపై తమిళనాడు సీఎం విజయ్...
  • ఎన్నికల కోసం శవ రాజకీయాలు చేశారని స్టాలిన్‌‌‌‌పై ఫైర్​
  • అక్కాచెల్లెళ్ల బిడ్డలను కోల్పోయామని ఆవేదన
  • సీఎం హోదాలో తొలిసారి కరూర్‌‌‌‌కు వచ్చిన టీవీకే చీఫ్
  • బాధితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత

గతేడాది ఎన్నికల ప్రచారంలో కరూర్‌‌లో జరిగిన తొక్కిసలాట వెనుక అప్పటి డీఎంకే ప్రభుత్వ రాజకీయం, పోలీసుల నిర్లక్ష్యం ఉందని తమిళనాడు సీఎం విజయ్‌‌ పేర్కొన్నారు. తాను పోలీసులను నమ్మితే.. మరణాలకు తననే నిందించారని ఆవేదన వ్యక్తం చేశారు.

చెన్నై: గత ఏడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా కరూర్‌‌‌‌లో జరిగిన పార్టీ బహిరంగ సభలో చోటుచేసుకున్న ఘోర తొక్కిసలాట, 41 మంది మరణాల వెనుక అప్పటి డీఎంకే ప్రభుత్వ కుట్ర, పోలీసుల నిర్లక్ష్యం దాగి ఉందని తమిళనాడు సీఎం విజయ్‌‌‌‌ పేర్కొన్నారు. ఆ ర్యాలీకి ఎక్కువ మంది వచ్చిన విషయం పోలీసులకు తెలుసని, అయినా దాన్ని ఎందుకు మధ్యలోనే రద్దు చేయలేదని ప్రశ్నించారు. తాను పోలీసులను నమ్మితే.. మరణాలకు తననే నిందించారని ఆవేదన వ్యక్తంచేశారు. తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శుక్రవారం తొలిసారి కరూర్ జిల్లాలో పర్యటించారు. 

ఈ పర్యటనలో భాగంగా నాటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలను కలుసుకొని ఓదార్చారు. ఈ సందర్భంగా భావోద్వేగ ప్రసంగం చేశారు. ‘‘ఒక మనిషి జీవితంలో ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరుకున్నా, మనసును నిరంతరం వేధించే కొన్ని బాధలు, గాయాలు అలాగే ఉండిపోతాయి. 

నేను ఎన్నో అవమానాలు, గాయాలను దాటుకొని ఈ స్థాయికి వచ్చాను. కానీ, వాటన్నింటికంటే నన్ను నిలువెల్లా గాయపరిచిన సంఘటన కరూర్ దుర్ఘటనే. నా సొంత అక్కా చెల్లెళ్ల బిడ్డలను కోల్పోయినంత పెను నష్టం అది. ఆ చిన్నారుల ముఖాలు నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

నమ్మించి నట్టేట ముంచారు 

‘‘అరియలూర్ మీటింగ్ ముగించుకొని మేం పెరంబళూరు వెళ్తుండగా, అక్కడ జనసందోహం విపరీతంగా ఉందని.. రావద్దని అప్పటి పెరంబళూరు పోలీసులు మాకు ముందే సమాచారం ఇచ్చారు. పోలీసుల మాటను గౌరవించి వెనక్కి తగ్గాం. మరి అదేతరహాలో కరూర్ పోలీసులు మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఇక్కడ జనం అదుపు కావడం లేదు, రావద్దని మమ్మల్ని ఎందుకు ఆపలేదు?’’ అని ప్రశ్నించారు. 

తాను పోలీసులను పూర్తిగా నమ్మానని కానీ తెరవెనుక ఇంతటి డ్రామా నడుస్తోందని తనకు తెలియదని అన్నారు. ‘‘అక్కడ అంత భారీ జనం ఉంటే తగినంత పోలీస్ బందోబస్తు ఎందుకు కల్పించలేదు? ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? ఎవరి ఒత్తిడితో, ఎవరి ఆదేశాలతో పోలీసులు అలా ప్రవర్తించారు?’’ అంటూ విజయ్ నిలదీశారు.

స్టాలిన్ శవ రాజకీయాలు చేశారు 

నాటి సీఎం ఎంకే స్టాలిన్‌‌‌‌ను ఉద్దేశించి విజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘దుర్ఘటన జరిగిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా నాపై నిందలు వేస్తూ స్టాలిన్ రాజకీయ లాభం పొందాలని చూశారు. మేం ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చినవాళ్లం కానీ, ప్రజలను కాపాడుకోవడంలో విఫలమై, శవాలపై పేలాలు ఏరుకునే రాజకీయ వ్యాపారులం కాదు. మాపై కుట్రలు చేసి, ఇంతటి గాయాన్ని మిగిల్చి, తిరిగి మాపైనే నిందలు వేస్తారా? అందుకే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు డీఎంకేకు సరైన బుద్ధి చెప్పి మాకు అధికారం కట్టబెట్టారు. అయితే ఈ ఒక్క ఓటమితో సరిపోదు.. డీఎంకే మళ్లీ ఎప్పటికీ కోలుకోలేనంత శాశ్వత దెబ్బ కొట్టాలి” అని పిలుపునిచ్చారు.  

డీలిమిటేషన్‌‌‌‌ను అంగీకరించేదే లేదు 

కరూర్ వేదికగా కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్‌‌‌‌ బిల్లుపై విజయ్ యుద్ధం ప్రకటించారు. డీలిమిటేషన్ జరిగితే కేంద్ర నిధుల కేటాయింపులు, బడ్జెట్ వాటాల్లో తమిళనాడు తీవ్రంగా నష్టపోతుందని పేర్కొన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తాము స్వాగతిస్తామని, కానీ దాని ముసుగులో తమిళనాడు రాజకీయ ప్రాధాన్యతను తగ్గిస్తే ఊరుకోబోమని, ఎవరు తీసుకొచ్చినా డీలిమిటేషన్‌‌‌‌ను తమిళనాడు అంగీకరించదని సీఎం విజయ్ స్పష్టం చేశారు.

బాధితులకు ఉద్యోగాలు.. డీఎంకే కుట్రలకు కోర్టుల బ్రేక్

తొక్కిసలాటలో మరణించిన 41 మంది కుటుంబాలకు విజయ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించగా, దానిని అడ్డుకునేందుకు డీఎంకే ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. బాధితులకు ఉద్యోగాలిస్తే వారు సాక్షులుగా మారి కేసును ప్రభావితం చేస్తారంటూ డీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

అయితే, సుప్రీంకోర్టు డీఎంకే పిటిషన్‌‌‌‌ను తిరస్కరిస్తూ, ‘‘సీఎం విజయ్ ఈ కేసులో నిందితుడు కాదు.. ప్రభుత్వం ఏంచేయాలో కోర్టులు శాసించలేవు’’ అని తేల్చిచెప్పింది. మరోవైపు, మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కూడా ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని స్పష్టంచేస్తూ ఉద్యోగ పత్రాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బాధితులకు విజయ్ ఉద్యోగ నియామక పత్రాలు అందించారు.