ఓఆర్ఆర్పై ప్రమాదాల నివారణకు ఏఐ.. 80 క్రిటికల్ స్పాట్ల గుర్తింపు

ఓఆర్ఆర్పై ప్రమాదాల నివారణకు ఏఐ..  80 క్రిటికల్ స్పాట్ల గుర్తింపు
  • రిపీటెడ్ వయలేషన్లను గుర్తించి యాక్షన్​  
  • ఔటర్​పై వాహనం ఆగిపోతే  14449 సమాచారం ఇవ్వాలి  
  • కోఆర్డినేషన్​ మీటింగ్​లో సీపీ వీసీ సజ్జనార్  

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజా భద్రత బలోపేతంపై  హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ అధ్యక్షతన శుక్రవారం బంజారాహిల్స్  టీజీఐసీసీసీలో కో ఆర్డినేషన్​మీటింగ్​నిర్వహించారు. ఇందులో హెచ్‌‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హెచ్‌‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ రోహిత్ గోపిడి,  ఎన్‌‌హెచ్‌‌ఏఐ, జీహెచ్‌‌ఎంసీ, హెచ్‌‌జీసీఎల్, ఐఆర్బీ ఇన్‌‌ఫ్రా ప్రతినిధులు, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్​గిరి ట్రాఫిక్ పోలీసు అధికారులు పాల్గొని చర్చించారు. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించి రోడ్డు భద్రతకు సంబంధించిన చర్యలను పరిశీలించారు. 

80 క్రిటికల్​ స్పాట్స్​ గుర్తింపు 

సజ్జనార్​ మాట్లాడుతూ.. ఓఆర్ఆర్‌‌పై ప్రమాదాలు ఎక్కువగా జరిగే 80 క్రిటికల్ స్పాట్లను గుర్తించామని, వాటిలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ప్రమాదాల నివారణకు ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ సిస్టమ్‌‌ను అమల్లోకి తీసుకురావడంపై పరిశీలన జరుగుతోందన్నారు.

ఈ వ్యవస్థ ద్వారా ట్రాఫిక్ వయలేషన్స్​ను వేగంగా గుర్తించి, పదేపదే రూల్స్​బ్రేక్​చేసే వాహనదారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఓఆర్ఆర్‌‌పై నమోదవుతున్న ఉల్లంఘనల్లో దాదాపు 99 శాతం వాహనాలు రీపీటెడ్ వయలేషన్స్​కు పాల్పడుతున్నాయన్నారు. వీరిని మార్చేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. 

ఓఆర్ఆర్‌‌పై వాహనాలు బ్రేక్‌‌డౌన్ కావడం వల్ల కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, అలాంటి వాహనాలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఓఆర్​ఆర్​పై ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను నిలపరాదని, వాహనం ఆగిపోతే 14449 హెల్ప్‌‌లైన్‌‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. 

బ్లాక్​స్పాట్స్​ వద్ద రక్షణ చర్యలు 

హెచ్‌‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఓఆర్ఆర్‌‌పై అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు హెచ్‌‌ఎండీఏ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ల వద్ద రక్షణ చర్యలను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. హైదరాబాద్ అడిషనల్​సీపీ తప్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్, సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ సన్‌‌ప్రీత్ సింగ్, జాయింట్ ట్రాన్స్‌‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, ఐఆర్బీ, ఎన్‌‌హెచ్‌‌ఏఐ, జీహెచ్‌‌ఎంసీ ఉన్నతాధికారులు, ట్రాఫిక్ డీసీపీలు, అదనపు డీసీపీలు తదితరులు పాల్గొన్నారు.