జడ్జిల నియామకాల్లో సామాజిక న్యాయం పాటించాలి: ఎన్‌ఎస్‌ఎల్‌వో వినతి

జడ్జిల నియామకాల్లో సామాజిక న్యాయం పాటించాలి: ఎన్‌ఎస్‌ఎల్‌వో వినతి

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని నేషనల్‌ సమతా లాయర్స్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఎల్‌వో-భారత్‌) కోరింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం అందజేసింది.

ప్రస్తుతం హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతున్నందున, సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకుని నియామకాలు చేయాలని సంస్థ కోరింది. ఎస్సీ వర్గానికి కనీసం ఇద్దరు, ఎస్టీ వర్గానికి ఒకరికి అవకాశం కల్పించేలా పేర్లను సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేసింది.

చాలా ఏండ్లుగా హైకోర్టు జడ్జీల నియామకాల్లో సామాజిక న్యాయం సరిగ్గా అమలు కావడం లేదని సంస్థ పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన పలువురు సీనియర్‌ లాయర్లు ఎన్నో ఏండ్లుగా సేవలు అందిస్తున్నా, వారికి జడ్జీలుగా అవకాశం రావడం లేదని తెలిపింది.

రాజ్యాంగం కూడా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెబుతోందని, న్యాయవ్యవస్థలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటే ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుందని వినతిపత్రంలో పేర్కొంది. అనుభవం ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ న్యాయవాదుల పేర్లను జడ్జీల నియామకాల్లో పరిగణించాలని కోరింది. వినతిపత్రం అందజేసిన వారిలో ఎన్‌ఎస్‌ఎల్‌వో రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్‌ పుట్టా పద్మారావు, ప్రధాన కార్యదర్శి అడ్వకేట్‌ టి.వి. రమేశ్ ఉన్నారు.