హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నుంచి జన జాగరణ యాత్ర ప్రారంభిస్తున్నట్లు సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి ఈ యాత్ర మొదలవుతుందని చెప్పారు. గత 22 ఏండ్లుగా సీపీఎస్ వల్ల లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయ కుటుంబాలు సామాజిక భద్రత కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో వారు మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో ఉన్న రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తున్నారని, తెలంగాణలో కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ నెల 11 నుంచి ఆగస్టు 18 వరకు రెండు విడతల్లో 33 జిల్లాల్లో జన జాగరణ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు.
ఈ యాత్రకు టీఎన్జీఓ, టీజీఓ, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఎస్టీయూ, టీపీటీఎఫ్ వంటి ఉద్యోగ సంఘాలు, ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మద్దతు తెలిపారని వెల్లడించారు. యాత్ర ముగింపు సందర్భంగా ఆగస్టు 23న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి సీపీఎస్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆఫీస్ సబార్డినేట్ల నుంచి గ్రూప్-1 అధికారుల వరకు ప్రతి సీపీఎస్ ఉద్యోగి ఈ పోరాటంలో కలిసిరావాలని పిలుపునిచ్చారు.
