హైదరాబాద్: మెడికల్ ఎక్విప్‌‌మెంట్ కొనుగోళ్లపై ఆన్‌‌లైన్ నిఘా

హైదరాబాద్: మెడికల్ ఎక్విప్‌‌మెంట్ కొనుగోళ్లపై ఆన్‌‌లైన్ నిఘా
  •     పారదర్శకతే లక్ష్యంగా సిస్టమ్‌‌ ను మార్చాలని అధికారులకు మంత్రి దామోదర ఆదేశం

హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్విప్‌‌మెంట్ అవసరం గుర్తించడం నుంచి కొనుగోలు, ఇన్‌‌స్టాలేషన్ వరకు ప్రతి దశను ఆన్‌‌లైన్‌‌లో ట్రాక్ చేసేలా సిస్టమ్ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులను ఆదేశించారు. కోఠిలోని టీజీఎంఎస్‌‌ఐడీసీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. 

ఎక్కడ ఆలస్యం జరుగుతుందో వెంటనే తెలిసేలా ఎండ్‌‌-టు-ఎండ్ డిజిటల్ టూల్‌‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. దీంతో అవినీతికి అవకాశం తగ్గుతుందని చెప్పారు. ఆసుపత్రుల్లో ఉన్న మిషన్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా తెలుసుకునేందుకు సెంట్రలైజ్డ్ డ్యాష్‌‌బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి అధికారులు సమీక్ష చేసి, రిపేర్లు ఉంటే బాగు చేయించాలన్నారు. మెయింటెనెన్స్‌‌లో నిర్లక్ష్యం చేసే కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, జరిమానాలు విధించాలన్నారు.

8 మంది బయోమెడికల్ ఇంజినీర్ల నియామకం..

మెడికల్ మిషన్ల పనితీరును పర్యవేక్షించేందుకు కొత్తగా 8 మంది బయోమెడికల్ ఇంజినీర్లను నియమించాలని మంత్రి నిర్ణయించారు. ఇందులో నలుగురిని హైదరాబాద్ రీజియన్‌‌కు, మరో నలుగురిని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ జోన్లకు కేటాయించనున్నారు. ఈ ఇంజినీర్లు ఆసుపత్రులను సందర్శిస్తూ మిషన్ల పరిస్థితిని పరిశీలిస్తారు. అవసరమైన రిపేర్లు, మెయింటెనెన్స్‌‌పై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు. టీజీఎంఎస్‌‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, డీఎంఈ నరేంద్ర కుమార్, డీపీహెచ్ రవీంద్ర నాయక్, అధికారులు పాల్గొన్నారు.