హైదరాబాద్, వెలుగు: డీఎస్పీ భీంరెడ్డి అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు వేగం పెంచింది. భీంరెడ్డి దగ్గర దొరికిన డైరీలో ఉన్న ఫోన్ నంబర్లు, డబ్బుల లావాదేవీల వివరాల ఆధారంగా కొంతమంది సినీ నటులు, ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దుబాయ్‌లో ఓ సినీ హీరోతో కలిసి ఉన్న ఫొటోలు, మణికొండలో ఫ్లాట్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పంద పత్రాల వివరాలను ఏసీబీ ఇప్పటికే సేకరించింది.
ఆ ఫ్లాట్ డీల్‌లో రూ.3 కోట్ల అడ్వాన్స్ ఇచ్చిన విషయంపై వివరాలు తెలుసుకోవడానికి ఆ హీరోకు నోటీసులు ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇద్దరు మాజీ మంత్రులు, వారి కుటుంబ సభ్యులతో భీంరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇదిలా ఉండగా, భీంరెడ్డి ఇద్దరు బీఆర్ఎస్మాజీ మంత్రులు, ఇద్దరు సినీ హీరోలతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
