- కొలియర్స్ తాజా నివేదికలో వెల్లడి
- 2030 నాటికి రాష్ట్రంలో 20 గిగావాట్ల ఉత్పత్తి!
- సుమారు లక్ష ఎకరాలు అవసరమని అంచనా
- రూ.80 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం
హైదరాబాద్, వెలుగు: దేశంలోనే సోలార్ఎనర్జీకి తెలంగాణ అనుకూలమని ప్రముఖ ‘కొలియర్స్’ రియల్ ఎస్టేట్‌సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో ఏడాదిలో సుమారు 300 రోజులకు పైగా ఎండ ఉండడంతో సోలార్ ప్యానెళ్లు గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తాయని, ఇది పెట్టుబడులకు అనుకూల అంశమని పేర్కొంది. గుట్టలు, బంజరు భూములు ఎక్కువగా ఉండడంతో ఇక్కడి భౌగోళిక పరిస్థితులు సోలార్ పవర్ ఉత్పత్తికి దోహదపడతాయని స్పష్టం చేసింది.
కాగా, 2030 నాటికి తెలంగాణలో 20 గిగావాట్ల సామర్థ్యం మేర సోలార్‌ఎనర్జీ ఉత్పత్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న తరుణంలో వచ్చిన ఈ నివేదిక పెట్టుబడులకు ఊతమిచ్చే అవకాశముందని అధికారవర్గాల్లో చర్చ జరుగుతున్నది.
అనేక సానుకూలతలు
రాష్ట్రంలో విద్యుత్ గ్రిడ్ వ్యవస్థ, పారిశ్రామిక రంగానికి 24 గంటల కరెంట్ సప్లై చేసే వసతులు ఉండడం తెలంగాణకు అనుకూలంగా భావిస్తున్నారు. టీజీఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే సింగిల్ విండో పద్ధతిలో పారిశ్రామిక అనుమతులు, సోలార్ రంగంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు స్టాంప్ డ్యూటీ, విద్యుత్ సుంకం మినహాయింపు, భౌగోళిక అనుకూలత, హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం కలిసివస్తాయని చెప్తున్నారు.
ఐటీ, ఇంజినీరింగ్ హబ్‌గా హైదరాబాద్ వెలుగొందుతుండడం, సోలార్ రంగంలో సరికొత్త సాంకేతికత, అభివృద్ధికి, ప్లాంట్ల నిర్వహణకు అవసరమైన నైపుణ్యం గల ఇంజినీర్లు ఇక్కడ సులభంగా లభిండచం కూడా సానుకూల అంశాలని కొలియర్స్తన నివేదికలో వెల్లడించింది. సోలార్‌ఎనర్జీ తయారీకి కావాల్సిన అన్ని సౌకర్యాలు రాష్ట్రంలో ఉండడంతో దేశంలోని పెద్ద కంపెనీలు ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు నివేదిక వెల్లడించింది.
ఈ క్రమంలో ఇప్పటికే రూ.80 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్లు చేసుకున్నాయి. సోలార్ప్లాంట్లను ఎక్కువగా రాష్ట్రంలో సెకండ్, థర్డ్ గ్రేడ్పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉండడంతో భవిష్యత్ ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే అవకాశముందని ‘కొలియర్స్’పేర్కొనడం విశేషం.
2030 నాటికి సోలార్ పవర్ ఉత్పత్తి లక్ష్యం 20 గిగా వాట్లు
రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ’ ద్వారా 2030 నాటికి రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల (20 గిగావాట్ల) సోలార్విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 2047 నాటికి రాష్ట్రాన్ని ‘నెట్ జీరో’గా మార్చాలనే విజన్‌లో భాగంగా ఈ ప్రణాళికలను అమలుచేస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో రూ.66.5 కోట్లతో 18 విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద 19 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
పీఎం కుసుమ్ ప్రాజెక్ట్‌లో భాగంగా1,450 మెగావాట్ల సామర్థ్యంగల సోలార్ప్లాంట్లను రైతులు తమ వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేస్తున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పలు ఏరియాల్లో సోలార్ ప్లాంట్లు నిర్మిస్తున్నారు. దీంతోపాటు పీఎం సూర్యఘర్ స్కీమ్‌ద్వారా రూఫ్టాఫ్సోలార్ పనులు చేపడుతున్నారు. దీంతో రాబోయే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్‌ఎనర్జీ ఉత్పత్తికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
