- మొత్తం 88,053 సీట్లలో 79,891 సీట్లు భర్తీ
- మరో 8,162 సీట్లే మిగిలినయ్
- 87 కాలేజీల్లో వంద శాతం నిండిన సీట్లు
- ఎప్పటిలాగే ‘కంప్యూటర్ సైన్స్’కే స్టూడెంట్ల ఓటు
- ఈనెల 14 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ కు అవకాశం
రాష్ట్రంలో టీజీ ఈఏపీసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 79,891 మంది అభ్యర్థులకు సీట్లు దక్కాయి. కన్వీనర్ కోటాలో 88,053 సీట్లు అందుబాటులో ఉండగా.. 90.7 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీజీ ఈఏపీసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 79,891 మంది అభ్యర్థులకు సీట్లు దక్కాయి. కన్వీనర్ కోటాలో 88,053 సీట్లు అందుబాటులో ఉండగా.. 90.7 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈ మేరకు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన సీట్ల అలాట్మెంట్ వివరాలను శుక్రవారం ప్రకటించారు. సీట్లు పొందిన అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా 176 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా.. వాటిలో 88,053 సీట్లున్నాయి. ఈ సీట్ల కోసం ఫస్ట్ ఫేజ్లో 89,450 మంది సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం హాజరు కాగా.. వారిలో 88,510 మంది ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో 79,891 మందికి సీట్లు అలాట్ అయ్యాయి. మరో 8,162 సీట్లు మాత్రమే మిగిలాయి. కాగా.. 21 యూనివర్సిటీ కాలేజీలు ఉండగా, వాటిలో 6,363 సీట్లకుగానూ 5,303 సీట్లు నిండాయి. మరో 1,060 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
ఒక గవర్నమెంట్ కాలేజీ ఉండగా..అందులో 196 సీట్లు ఉంటే 56 మందికి సీట్లు అలాట్ అయ్యాయి. రెండు ప్రైవేటు వర్సిటీల్లో 1,367 సీట్లకు 1,366 సీట్లు నిండాయి. 152 ప్రైవేటు కాలేజీల్లో 80,127 సీట్లకు 73,166 సీట్లు భర్తీ కాగా.. మరో 6,961 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే, 79 ప్రైవేటు కాలేజీలు, 8 యూనివర్సిటీ కాలేజీలోని అన్నీ సీట్లు నిండాయి. అయితే, మాక్ అలాట్మెంట్ లో సీట్లు పొందిన వారిలో 35.402 మందికి సీట్లు మారాయి. వీరితో పాటు మరో 6,335 మందికి ఈడబ్ల్యూఎస్ కోటాలో సీట్లు అలాట్ చేశారు.
ఎప్పటిలాగే ‘కంప్యూటర్’ క్రేజ్
ఈ ఏడాది కూడా విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ వైపే మొగ్గు చూపారు. సీఎస్ఈ అనుబంధ కోర్సుల్లో కలిపి మొత్తం 62,509 సీట్లు ఉండగా.. ఏకంగా 58,376 (93 శాతం) సీట్లు నిండిపోయాయి. కేవలం 4,133 సీట్లు మాత్రమే మిగిలాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్ వంటి స్పెషలైజేషన్లలో వంద శాతం సీట్లు భర్తీ కావడం గమనార్హం.
ఎలక్ట్రానిక్స్ విభాగంలో 17054 సీట్లకు గానూ 14688 సీట్లు నిండాయి. మరో 2366 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సివిల్, మెకానికల్ విభాగంలో 7455 సీట్లకు గానూ 5968 సీట్లు అలాట్ కాగా, మరో 1487 సీట్లు మిగిలాయి. ఇతర గ్రూపుల్లో 1035 సీట్లకు గానూ 859 సీట్లు నిండాయి.
14లోపు రిపోర్టింగ్ చేయాలి
సీటు పొందిన అభ్యర్థులు జూలై 14 లోపు ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు ఆదేశించారు. నిర్ణీత గడువులోగా ఫీజు కట్టని పక్షంలో ఆ సీటు ఆటోమేటిక్ గా రద్దు అవుతుందని స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ సొంత బ్యాంక్ ఖాతాల నుంచే ఫీజు చెల్లించాలని సూచించారు.
రెండో విడత కౌన్సెలింగ్ ముగిసిన తర్వాతే కాలేజీల్లో స్వయంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా అభ్యర్థి తన సీటును రద్దు చేసుకోవాలనుకుంటే వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో క్యాన్సల్ చేసుకోవచ్చు. అడ్మిషన్ పొందిన వారు డ్రగ్స్ వ్యతిరేక అఫిడవిట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది.
టాప్ బ్రాంచీలు, సీట్ల భర్తీ వివరాలు..
బ్రాంచ్ మొత్తం సీట్లు భర్తీ అయినవి ఖాళీలు
సీఎస్ఈ 29,519 27,990 1,529
సీఎస్ఎం 14,610 13,732 878
ఈసీఈ 11,725 10,593 1,132
డేటాసైన్స్ 8,017 7,395 622
ఈఈఈ 4,810 3,592 1,218
సివిల్ 3,621 2,920 701
మెకానికల్ 3,343 764 2,579
