హైదరాబాద్, వెలుగు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను శుక్రవారం లోక్ భవన్‌లో సీఎస్ సంజయ్ జాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సంజయ్‌కు గవర్నర్ అభినందనలు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుపరిపాలన లక్ష్యాల సాధనలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. భేటీ సందర్భంగా రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మరోవైపు, ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించారు. అలాగే, ఎస్‌బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ నీలేష్ ద్వివేది, జనరల్ మేనేజర్లు సతీశ్ కుమార్, రణ్‌విజయ్ ప్రతాప్ కూడా గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ విజన్–2047 రోడ్ మ్యాప్ కింద రాష్ట్రంలో ఏర్పడుతున్న అభివృద్ధి అవకాశాలను ఎస్‌బీఐ ప్రతినిధి బృందం గవర్నర్‌కు వివరించింది. రాష్ట్ర సమగ్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించడంలో ఎస్‌బీఐ పోషిస్తున్న వ్యూహాత్మక పాత్ర, భవిష్యత్ కార్యాచరణపై కూడా వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎస్‌బీఐ అందిస్తున్న సేవలను గవర్నర్ అభినందించారు. వ్యవసాయం, పారిశ్రామికం, మౌలిక వసతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు), స్టార్టప్‌లు, ఆర్థిక చేరిక (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) వంటి కీలక రంగాల్లో తన సహకారాన్ని మరింత విస్తరించి, తెలంగాణ అభివృద్ధిని వేగవంతం చేయడంలో ఎస్‌బీఐ కీలక పాత్ర పోషించాలని గవర్నర్ సూచించారు.
