- చిరునామాలు దొరక్క ‘పర్మినెంట్ షిఫ్ట్’ పేరుతో పక్కన
- లక్షలాది ఎన్యూమరేషన్ ఫారాలు ఓటర్లకు ఇంకా చేరలేదనే ఆరోపణలు
- 99 శాతానికి పైగా పంపిణీ చేశామంటున్న ఈసీ అధికారులు
- పైకి తప్పుడు వివరాలు పంపుతున్నారనే అనుమానాలు
- డిజిటలైజేషన్ టైమ్‌లో కష్టాలు తప్పకపోవచ్చనే అంచనా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ పట్టణ ప్రాంతాల్లో తీవ్ర అడ్డంకులు ఎదుర్కొంటోంది. గ్రామాల్లో ఏదో ఒకలా ఓటర్ల వివరాల నమోదు చేస్తున్నప్పటికీ, నగరాలు, పట్టణ నియోజకవర్గాల్లో మాత్రం క్షేత్రస్థాయి సిబ్బందికి చుక్కలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లకు గానూ రికార్డు స్థాయిలో 99.46 శాతం అంటే ఏకంగా 3.36 కోట్ల ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించింది.
కానీ క్షేత్రస్థాయిలో ముఖ్యంగా పట్టణాల పరిధిలో లక్షలాది ఓటర్లకు ఇంకా ఫారాలు అందలేదని తెలుస్తోంది. పంపిణీ చేయకుండానే చేసినట్లు పై అధికారులకు రిపోర్ట్ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లు భావిస్తున్నారు. తీరా ఇప్పుడు ఫారాలు వెనక్కి తీసుకొని, వివరాలు డిజిటలైజ్ చేస్తున్న క్రమంలో ఇబ్బందులు బయట పడ్తున్నట్లు తెలుస్తోంది. అడ్రస్‌లు దొరక్కపోవడం, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలోకి సిబ్బందిని అనుమంతించకపోవడం లాంటి కారణాల వల్ల అనేకమంది ఓటర్లను ‘పర్మినెంట్ షిఫ్ట్’ పేరిట పక్కనపెట్టినట్లు బీఎల్ఓలు చెప్తుండడంతో ఉన్నతాధికారులు తలపట్టుకుంటున్నారు.
దీనికితోడు సేకరించిన వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియలో తీవ్రమైన సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రాష్ట్ర సగటు కేవలం 20.55 శాతానికే పరిమితమైంది. ఈ నిర్లక్ష్యంతో రాష్ట్ర ఓటర్లలో దాదాపు 40 శాతానికి పైగా ఉన్న అర్బన్ ఓటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
40 శాతానికిపైగా ఓటర్లు పట్టణ ప్రాంతాల్లోనే
రాష్ట్రంలోని119 నియోజకవర్గాలలో దాదాపు 40 నియోజకవర్గాలు పూర్తిగా లేదా ప్రధానంగా పట్టణ పరిధిలోనే విస్తరించి ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం వంటి నగరాల పరిధిలోని మొత్తం పట్టణ ఓటర్ల సంఖ్య సుమారు 1.35 కోట్ల నుంచి 1.40 కోట్ల వరకు ఉంది. ఇది రాష్ట్ర మొత్తం ఓటర్లలో దాదాపు 40% నుంచి 42% శాతం వరకు వాటాను కలిగి ఉండడం గమనార్హం. ఇంతటి కీలకమైన ఓటు బ్యాంకు ఉన్న పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్లు మారడం, తాళాలు వేసి ఉండడం వల్ల సిబ్బంది నేరుగా ‘పర్మినెంట్ షిఫ్ట్’గా నమోదు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలోని 46 లక్షల 24 వేల 192 మంది ఓటర్లతో పాటు, కరీంనగర్(3.68 లక్షలు), నిజామాబాద్ అర్బన్ (3 లక్షలు) వంటి స్థానాల్లో వేలాది ఓట్లు గల్లంతయ్యే ప్రమాదముందని అనుమానిస్తున్నారు. అటు వరంగల్ వెస్ట్ 2.85 లక్షలు, వరంగల్ ఈస్ట్ 2.60 లక్షలు, రామగుండం 2.16 లక్షలు, పారిశ్రామిక హబ్‌గా మారిన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు (4.19 లక్షల ఓటర్లు) లాంటి నియోజకవర్గాల్లోనూ ఇదే విధమైన నిర్లక్ష్యం కనిపిస్తోంది.
సంగారెడ్డి (2.52 లక్షలు), ఖమ్మం (3.24 లక్షలు), మంచిర్యాల (2.82 లక్షలు) , నల్గొండ(2.51 లక్షలు), సూర్యాపేట (2.46 లక్షలు), మహబూబ్‌నగర్ (2.62 లక్షలు) లాంటి అర్బన్ నియోజకవర్గాల్లో ఎన్యుమరేషన్ ప్రక్రియ నామమాత్రంగా సాగడం వల్ల పెద్దసంఖ్యలో ఓట్లు గల్లంతయ్యే ప్రమాదముందని తెలుస్తోంది.
డిజిటలైజేషన్ లేట్..
గ్రేటర్ హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ఎన్యుమరేషన్ ఫారాల డేటా ఎంట్రీ నివేదికలు అధికారుల వైఫల్యానికి అద్దం పడుతున్నాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 29.79 లక్షల మంది ఓటర్లు ఉండగా కేవలం 2.44 శాతం మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయింది. హైదరాబాద్ జిల్లాలో 47.36 లక్షల మంది ఓటర్లకు గానూ కేవలం 5.77 శాతం, రంగారెడ్డి జిల్లాలో 36.99 లక్షల మంది ఓటర్లకు కేవలం 8.85 శాతం మాత్రమే నమోదైంది.
సంగారెడ్డి జిల్లాలో సైతం 14.57 లక్షల మంది ఓటర్లకు గానూ కేవలం 13.20 శాతం డేటా మాత్రమే కంప్యూటర్లకెక్కింది. ఈ ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయకపోడం, వివరాలు నమోదు చేసేందుకూ ఎవరు ఎక్కడున్నారో తెలియకపోవడంతో తక్కువగా ఎంట్రీ అవుతున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కుమ్రంభీం ఆసిఫాబాద్(48.48%), నల్గొండ (46.82%), నిజామాబాద్(37.74%) జిల్లాలు డిజిటలైజేషన్‌లో కొంత మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. కానీ, రాష్ట్ర సగటు కేవలం 20.55 శాతానికే పరిమితం కావడం వెనుక ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం స్పష్టంగా కనిపిస్తోందని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.
