మళ్లీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు... జులైలో సాధారణం కంటే రెండు..మూడు డిగ్రీలు ఎక్కువ నమోదు

మళ్లీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు... జులైలో సాధారణం కంటే రెండు..మూడు డిగ్రీలు ఎక్కువ నమోదు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో వర్షాలు పడకపోవడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గాలిలో సరైన తేమ లేకపోవడంతో ఎండల ప్రభావం ఎక్కువవుతున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణం కన్నా రెండు, మూడు డిగ్రీల మేర ఎక్కువ టెంపరేచర్స్​నమోదవుతున్నాయి. 

ఈ నెలంతా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. శుక్రవారం నిర్మల్​జిల్లాలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా నేరెళ్ల, పెద్దపల్లి జిల్లా ఓదెల, హైదరాబాద్, నల్గొండ జిల్లా చండూరులలో 37 డిగ్రీల మేర రికార్డయ్యాయి. 

మొత్తంగా 28 జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు అంటే 35 డిగ్రీలకుపైగానే నమోదయ్యాయి. అందులో 16 జిల్లాల్లో 36 డిగ్రీలకుపైగా నమోదవగా.. ఐదు జిల్లాల్లో 35 డిగ్రీల మేర నమోదయ్యాయి. కేవలం రంగారెడ్డి, సంగారెడ్డి, రాజన్నసిరిసిల్ల, హనుమకొండ, ములుగు జిల్లాల్లో మాత్రమే సాధారణం కన్నా తక్కువగా టెంపరేచర్లు రికార్డు అయ్యాయి. ఎండ తీవ్రత పెరగడంతో ఉక్కపోత కూడా తీవ్రమైంది. 

రెండు వారాలు వర్షాలు నామమాత్రమే...

రాబోయే రెండు వారాల పాటు వర్షాలు నామమాత్రంగానే కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. రాష్ట్రంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతమే నమోదవుతుందని వీక్లీ అంచనాల్లో ఐఎండీ వెల్లడించింది. వాతావరణ పరిస్థితుల్లో మార్పులొస్తే మరింత తక్కువ వర్షాలు పడే ప్రమాదం ఉందని తెలిపింది. 

నదులకు ప్రవాహాలకు అత్యంత కీలమైన మహారాష్ట్ర, కర్నాటకల్లోనూ ఈ రెండు వారాలు వర్షాలు తగ్గుతాయని స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల్లోనూ మళ్లీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంది. అదే సమయంలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీల వరకు పెరిగే చాన్స్​ఉందని పేర్కొంది. భారీ వర్షాలు పడే అవకాశం  తక్కువని స్పష్టం చేసింది. అల్పపీడనం కూడా శనివారం నాటికి పూర్తిగా బలహీనపడుతుందని ఐఎండీ వెల్లడించింది.