సాక్ష్యాలు లేవు.. నిందితులెవరో తెలియదు.. కనీసం దొరికిన శవం ఎవరిదో కూడా గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. ఇలాంటి ఒక క్లిష్టమైన మర్డర్ మిస్టరీని.. కేవలం ఘటనా స్థలంలో దొరికిన ఒకే ఒక్క సగం కాలిన పాపడం ప్యాకెట్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు నమ్మశక్యం కాని రీతిలో ఛేదించారు.
అనంతపురం జిల్లా పులాకుర్తి గ్రామం సమీపంలోని పొలాల్లో జూన్ 23న ఒక వ్యక్తి మృతదేహం పూర్తిగా కాలిన స్థితిలో లభ్యమైంది. క్లూస్ కోసం వెతికిన పోలీసులకు అక్కడ సగం కాలిన కన్నడ దినపత్రిక, బట్టలు, ఒక జంధ్యం, సగం కాలిన ఒక పాపడం ప్యాకెట్ దొరికాయి. ఇందులో ఆ పాపడం ప్యాకెట్ ఈ కేసుకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆ ప్యాకెట్‌పై ఉన్న అడ్రస్ ఆధారంగా ఏపీ పోలీసులు చెన్నై నుంచి కర్ణాటకలోని బళ్లారి వరకు సప్లై చైన్‌ను ట్రాక్ చేశారు.
ఈ విచారణలో ఆ శవం బళ్లారికి చెందిన పాపడం వ్యాపారి గురురాజు రావుదిగా గుర్తించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మృతుడు గురురాజు రావుతో పాటు, అతడిని హత్య చేసిన నిందితులు బసవరాజు, కొట్రేష్‌లు కూడా మూగ, చెవుడు ఉన్నవారే.. గురురాజు రావు దగ్గర భారీగా డబ్బు ఉందనే ఆశతో.. నిందితులిద్దరూ అతడిని అనంతపురం రప్పించి, దారుణంగా హత్య చేసి, ఆధారాలు దొరక్కుండా శవాన్ని తగులబెట్టారు. అనంతరం బాధితుడి మొబైల్, బైక్, ఏటీఎం కార్డుతో పారిపోయారు.
హత్య తర్వాత నిందితులు బాధితుడి ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేస్తుండగా.. అక్కడి సిసిటివి (CCTV) కెమెరాల్లో వారు సైగలతో (Sign Language) మాట్లాడుకోవడం రికార్డయ్యింది. ఈ విజువల్స్, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులను ఓబుళాపురం క్రాస్ వద్ద ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు మూగ, చెవిటి వారు కావడంతో సైగ భాషా నిపుణుల (Sign Language Experts) సాయంతో విచారించగా.. వారు నేరాన్ని అంగీకరించారు. వారి నుంచి మృతుడి బైక్, మొబైల్ ఫోన్, పాపడం బండల్స్‌ను రికవరీ చేశారు.
అసాధ్యం అనుకున్న ఈ కేసును అంతరాష్ట్ర బోర్డర్లు దాటి అత్యంత చాకచక్యంగా ఛేదించిన అనంతపురం ఎస్పీ పి. జగదీష్ , పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు, ప్రజలు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
