జైపూర్‌లో తొమ్మిదేళ్ల విద్యార్థిని అమైరా మృతి ఘటన దేశవ్యాప్తంగా స్కూళ్లలో విద్యార్థుల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన కొత్త సీసీటీవీ ఫుటేజ్ ఆమె పేరెంట్స్ వెలుగులోకి తీసుకు రావడంతో, విద్యార్థులు ఎదుర్కొనే బుల్లీయింగ్, ర్యాగింగ్, మానసిక వేధింపులను ఎంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందో స్పష్టమవుతోంది.
గత ఏడాది నవంబర్‌లో జైపూర్‌లోని నీరజ మోడీ స్కకూల్ నాలుగో అంతస్తు నుంచి దూకిన తొమ్మిదేళ్ల అమైరా మృతి ఘటనపై కొత్త సీసీటీవీ ఫుటేజ్ మరోసారి చర్చనీయాంశమైంది. అమైరా పేరెంట్స్ విడుదల చేసిన ఓ వీడియో..విషాద ఘటన జరగడానికి ముందు ఏం జరిగిందో చూపిస్తోంది. నాలుగో తరగతి చదువుతున్న ఆ విద్యార్థినిని తోటి విద్యార్థులు పదేపదే వేధించారని, సహాయం కోసం ఆమె చేసిన రిక్వెస్ట్ ను టీచర్లు పట్టించుకోలేదని చెప్పడానికి ఈ వీడియోను సాక్ష్యంగా చూపుతున్నారు.
2025 నవంబర్ 1న జరిగిన ఈ ఘటనలో స్కూళ్ల తమ కుమార్తెను తోటి విద్యార్థులు వేధించారని ఆరోపిస్తూ, బాధితురాలి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నిర్లక్ష్యం, వేధింపులను అరికట్టడంలో వైఫల్యం,స్కూల్ లో తగిన పిల్లల భద్రతా వ్యవస్థ లేకపోవడం వల్లే ఈ విషాదం జరిగిందని.. ఆ ఫుటేజ్ సాక్ష్యం అని బాధితురాలి తల్లిదండ్రులు అంటున్నారు.కొత్తగా లభించిన ఫుటేజ్‌ను చూపిస్తూ తన కుమార్తె సహాయం కోరినా ఆమెను పట్టించుకోలేదని పేరెంట్స్ ఆరోపించారు. అమైరా పేరెంట్స్ ఫిర్యాదుతో స్కూల్ యజమాని సౌరభ్ మోడీ, ప్రిన్సిపాల్ ఇందు దుబే ,క్లాస్ టీచర్ పూనితా శర్మల పేర్లను ఛార్జిషీట్‌లో చేర్చారు పోలీసులు.
ఇటీవల డేకేర్ సెంటర్లలో కూడా పిల్లల భద్రతపై ఆందోళన కలిగించే సంఘటనలు చోటు చేసుకున్నాయి. నిర్వాహకులు డబ్బులు దండుకోవడం తప్పా పిల్లల భద్రతపై ఏమాత్రం దృష్టి సారించడం లేదని ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఈ క్రమంలో స్కూల్స్, కాలేజీలకు వెళ్లే పిల్లల భద్రత, భవిష్యత్తుపై పేరెంట్స్ ఆందోళన చెందుతున్న సందర్భాలు చాలా వెలుగు చూశాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాఠశాలల్లో తోటి విద్యార్థుల వేధింపులు చిన్నపిల్లలపై తీవ్ర మానసిక ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల విద్యార్థులు చేసే ప్రతి ఫిర్యాదును ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలి. పిల్లల ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు కనిపిస్తే వాటి కారణాలను తెలుసుకుని అవసరమైన సహాయం అందించాల్సి ఉంటుంది.
పాఠశాలల్లో బుల్లీయింగ్, ర్యాగింగ్‌ను అరికట్టేందుకు కఠిన నిబంధనలు అమలు చేయడంతో పాటు, కౌన్సెలింగ్ వ్యవస్థ, ఫిర్యాదు స్వీకరణ కమిటీలు, సమర్థవంతమైన సీసీటీవీ పర్యవేక్షణ వంటి భద్రతా చర్యలు తప్పనిసరిగా ఉండాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే విధానాన్ని కూడా ప్రతి విద్యాసంస్థ అమలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
మరోవైపు, తల్లిదండ్రులు కూడా పిల్లలతో ప్రతిరోజూ మాట్లాడి పాఠశాలలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకుని, వారి మాటలను శ్రద్ధగా వినడం ద్వారా అనేక సమస్యలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.
స్కూల్స్ కేవలం విద్యను అందించే కేంద్రాలే కాకుండా, విద్యార్థులు భద్రంగా, ఆత్మవిశ్వాసంతో ఎదిగే వేదికలుగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
