హైదరాబాద్: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision - SIR 2026) ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే, సర్ ప్రక్రియలో ఓటర్లు సమర్పించే హిజాబ్ లేదా హెడ్‌స్కార్ఫ్ ధరించిన ఫొటోలపై కొంత గందరగోళం నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ సమస్య ఎక్కుగా ఉంది. ఈ క్రమంలో హిజాబ్ ఫొటోల అంశంపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ క్లారిటీ ఇచ్చారు. హిజాబ్ లేదా హెడ్‌స్కార్ఫ్ ధరించిన మహిళల ఫొటోలు పూర్తిగా ఆమోదయోగ్యమని తెలిపారు. అయితే, హిజాబ్ ధరించినా ముఖం మాత్రం స్పష్టంగా కనిపించాలని చెప్పారు. దీంతో సర్ ప్రక్రియలో హిజాబ్ ఫొటోల వివాదానికి తెరపడింది.
అసలు వివాదం ఏంటంటే..?
సర్ ప్రక్రియలో భాగంగా ఓటరు నమోదు కోసం ఇచ్చే ఎన్యుమరేషన్ ఫారమ్ (Enumeration Form)లపై హిజాబ్ ధరించిన ఫొటోలను తిరస్కరిస్తున్నారనే సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. అలాగే, క్షేత్రస్థాయిలో కొంతమంది బీఎల్వోలు కూడా చెవులు కనిపించడం లేదంటూ హిజాబ్ ధరించిన మహిళల ఓటర్ల ఫొటోలు తిరస్కరిస్తున్నారు. దీంతో హిజాబ్ ధరించిన ఫొటోల అంశంపై కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియలో హిజాబ్ ధరించిన ఫొటోలు ఆమోద్యయోగమేనని అధికారులు క్లారిటీ ఇచ్చారు.
