పంజాబ్ స్టార్ దిల్ జిల్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన 'సత్లుజ్' (Satluj) మూవీ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. రిలీజైన 48 గంటల్లోనే OTT ప్లాట్‌ఫామ్ ZEE5 నుండి ఈ చిత్రాన్ని ఆకస్మికంగా తొలగించడం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో సిక్కు సంస్థలు, సినిమా ఇండస్ట్రీ, పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరో వైపు ఈ వివాదం ఇప్పుడు న్యాయస్థానానికి చేరుకుంది. సినిమా తిరిగి స్ట్రీమింగ్‌లోకి తీసుకురావాలని కోరుతూ పంజాబ్-హర్యానా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది.
హైకోర్టు మెట్లెక్కిన వివాదం..
ఈ సినిమాను తిరిగి ప్రసారం చేయాలంటూ పంజాబ్, హర్యానా హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (PIL) దాఖలైంది. పంజాబ్‌కు చెందిన ZEE5 సబ్‌స్క్రైబర్ శ్రవణ్ సింగ్ ఈ పిటిషన్ వేశారు. ఎలాంటి ముందస్తు నోటీసు, స్పష్టమైన కారణం లేకుండా సినిమాను తొలగించడం రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19 ప్రకారం భావప్రకటన స్వేచ్ఛ ఉల్లంఘనే అని లాయర్ హకం సింగ్ పేర్కొన్నారు. ఈ వివాదంపై కేంద్రం ముగ్గురు సభ్యుల కమిటీని వేసినా, అసలు కారణాలు మాత్రం బయటపెట్టలేదు.
అసలు కథేంటి? ఎందుకీ వివాదం?
ఈ చిత్రం ప్రముఖ సిక్కు మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. మొదట 2022లో 'పంజాబ్ 95' (Punjab 95) పేరుతో సెన్సార్ బోర్డు ముందుకు వచ్చింది. అయితే సీబీఎఫ్‌సీ ఏకంగా 127 కట్లు సూచించినట్లు సమాచారం. అయితే చిత్రబృందం వాటిని అంగీకరించకపోవడంతో సర్టిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో థియేటర్ సెన్సార్ గొడవ పక్కనపెట్టి.. పేరు మార్చి 'సత్లుజ్'గా జూలై 3న సైలెంట్‌గా ZEE5 లో రిలీజ్ చేశారు.
సిక్కు సంఘాలు సీరియస్..
అయితే ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో.. ఐటీ రూల్స్ (IT Rules 2021) ప్రకారం భద్రతా కారణాల దృష్ట్యా సినిమాను తొలగించాలని ZEE5ని ఆదేశించారు. రూల్స్ ప్రకారం సెన్సార్ సమస్యలు తేల్చుకున్నాకే సినిమాను తీసుకురావాలని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, చిత్రాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకురావాలంటూ సినీ ప్రముఖులు, సిక్కు సంఘాలు, పౌరహక్కుల సంస్థలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు హైకోర్టు ఈ అంశంపై ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది..
