అయోధ్య హుండీల్లో 10, 20 రూపాయల నోట్లే.. విరాళాల స్కాం తర్వాత 500 నోట్లు తగ్గిపోయాయి..!

అయోధ్య హుండీల్లో 10, 20 రూపాయల నోట్లే.. విరాళాల స్కాం తర్వాత 500 నోట్లు తగ్గిపోయాయి..!

అయోధ్య రామాలయం విరాళాలచోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.  విరాళాల దొంగతనం బయటపడ్డ తర్వాత విరాళాలలుగా ఇచ్చే 500 రూపాయల నోట్ల సంఖ్య తగ్గిందని, రూ.10, రూ. 20 నోట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని, విరాళాల లెక్కింపు బాధ్యతలు నిర్వహిస్తున్న 23 మంది ఉద్యోగులు ఒకేసారి రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

ఆలయంలో విరాళాల లెక్కింపు బాధ్యతలు నిర్వహిస్తున్న 23 మంది ఉద్యోగులు తమ పదవులకు శుక్రవారం (జూలై 10) రాజీనామా చేశారు. పని గంటలు పెరిగాయి కానీ వేతనాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడమే ప్రధాన కారణమని చెబుతున్నారు. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు  వైదొలగడం ఆలయ నిర్వహణలో కొత్త సవాళ్లకు దారితీసింది.

పనిభారం ఎందుకు పెరిగింది?

గతంలో భక్తులు ఎక్కువగా రూ.500 నోట్ల రూపంలో విరాళాలు సమర్పించేవారు. అప్పట్లో ఒక రోజులో 70 నుంచి 80 కట్టల వరకు రూ. 500 నోట్లను సిద్ధం చేసేవారు. దీంతో లెక్కింపు పని వేగంగా పూర్తయ్యేది. ఆలయంలో చోరీ తర్వాత ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వారు చెబుతున్నారు. ఇప్పుడు భక్తులు ఎక్కువగా రూ.10, రూ.20, రూ.50 వంటి చిన్న విలువ కలిగిన నోట్లను సమర్పిస్తున్నారు. ఈ కారణంగా అదే మొత్తాన్ని లెక్కించడానికి చాలా ఎక్కువ సమయం పడుతోందని ఉద్యోగులు అంటున్నారు.

ప్రస్తుతం ఒక రోజులో కేవలం 15 కట్టల వరకు మాత్రమే రూ.500 నోట్ల సమానమైన మొత్తం సిద్ధమవుతోందని సమాచారం. చిన్న నోట్ల సంఖ్య పెరగడంతో ప్రతి నోటును విడిగా లెక్కించడం, కట్టలు వేయడం, రికార్డులు నమోదు చేయడం వంటి పనులు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి.

ఇంతకుముందు ఉద్యోగులు రెండు షిఫ్టుల్లో పనిచేసేవారు. ఒక్కో ఉద్యోగి ఆరు గంటల పాటు విధులు నిర్వహించేవారు. అయితే ప్రస్తుతం షిఫ్ట్ విధానాన్ని మార్చి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒకే షిఫ్ట్‌గా మార్చినట్లు ఉద్యోగులు తెలిపారు. అంటే పని గంటలు గణనీయంగా పెరిగినా, జీతాల్లో మాత్రం ఎలాంటి పెంపు లేకపోవడంతో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

23 మంది రాజీనామాల తర్వాత ప్రస్తుతం విరాళాల లెక్కింపు విభాగంలో కేవలం 13 మంది సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో మిగిలిన ఉద్యోగులపై మరింత పనిభారం పడే అవకాశం ఉంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో విరాళాల లెక్కింపు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని ఉద్యోగులు చెబుతున్నారు. 

ఇటీవల ఆలయంలో విరాళాల దొంగతనానికి సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఈ ఘటన తర్వాత విరాళాల లెక్కింపు విధానం, భద్రతా చర్యలు, పారదర్శకత వంటి అంశాలపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తాయి.ఈ క్రమంలో ఉద్యోగుల రాజీనామాలు కూడా మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఉద్యోగులు తమ రాజీనామాలకు ప్రధాన కారణం పని గంటల పెరుగుదలేనని చెబుతున్నారు.

జూలై 13న సుప్రీంకోర్టులో విచారణ

ఆలయంలో విరాళాల నిర్వహణపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు జూలై 13న విచారించనుంది. చీఫ్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును పరిశీలించనుంది. పిటిషన్లలో సీబీఐ దర్యాప్తు, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు, ఆలయ విరాళాల నిర్వహణను సమీక్షించే నిపుణుల కమిటీ నియామకం చేయాలని  పిటిషనర్లు కోర్టును విన్నవించారు.