గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చున్న తర్వాత మీ కళ్ళు నిరంతరం పొడిబారినట్లు అనిపిస్తుందా? లేదా, అసాధారణంగా నోరు పొడిబారడం వల్ల తరుచుగా నీళ్లు తాగాలనిపిస్తుందా? చాలా మంది దీనికి డీహైడ్రేషన్, ఎయిర్ కండిషనింగ్, వృద్ధాప్యం లేదా సరిగా నిద్రపోకపోవడం వంటివి కారణాలుగా చెబుతున్నప్పటికీ అంత ప్రమాదకరం కానివిగా కనిపించే ఈ లక్షణాలు కొన్నిసార్లు, నిర్లక్ష్యం చేయకూడని ఒక అంతర్లీన ఆటో ఇమ్యూన్ వ్యాధికి సంకేతాలు కావొచ్చంటున్నారు డాక్టర్లు. ఇంతకీ ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటే ఏమిటీ, లక్షణాలు తెలుసుకుందాం.
కళ్లు, నోరు తరచుగా పొడిబారడం సాధారణ సమస్యగా అనిపించినా, కొన్ని సందర్భాల్లో ఇది స్జోగ్రెన్ సిండ్రోమ్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధికి ప్రారంభ సంకేతం కావచ్చంటున్నారు డాక్టర్లు. ఈ వ్యాధిలో రోగనిరోధక వ్యవస్థ పొరపాటున కన్నీళ్లు, లాలాజలం ఉత్పత్తి చేసే గ్రంథులపై దాడి చేస్తుంది. దీంతో కన్నీళ్లు, లాలాజలం తగ్గి కళ్లు, నోరు పొడిబారుతాయి.
డాక్టర్ల వివరాల ప్రకారం..ఈ సమస్య కొన్ని వారాల పాటు కొనసాగి రోజువారీ పనులకు ఇబ్బంది కలిగిస్తే తప్పకుండా డాక్టర్ ని సంప్రదించాలి.
గమనించాల్సిన 5 ముఖ్య లక్షణాలు:
నిరంతరం నోరు పొడిబారడం: ఎంత నీరు తాగినా నోరు పొడిగానే ఉండటం, జిగటగా అనిపించడం, తరచూ నీరు తాగాలనిపించడం.
నమలడం, మింగడంలో ఇబ్బంది: లాలాజలం తగ్గడంతో రొట్టె, బిస్కెట్లు, అన్నం వంటి పొడి ఆహారాలను తినడం, మింగడం కష్టమవుతుంది.
తరచూ పంటి సమస్యలు: లాలాజలం తగ్గడం వల్ల దంతక్షయం, చిగుళ్ల వ్యాధులు, నోటి దుర్వాసన, నోటి ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
లాలాజల గ్రంథులు వాపు:దవడ, బుగ్గలు లేదా చెవుల కింద గ్రంథులు వాపు రావడం, నొప్పి ఉండటం కూడా ఈ వ్యాధికి సంకేతం కావచ్చు.
పొడి కళ్లతో పాటు అలసట, కీళ్ల నొప్పులు: కళ్లలో మంట, ఇసుక పడ్డట్లు అనిపించడం, అలాగే అలసట, కీళ్ల నొప్పులు లేదా వాపు ఉంటే ఆటో ఇమ్యూన్ వ్యాధికి ముఖ్య లక్షణాలుగా చెబుతున్నారు.
ALSO READ : ఎన్ని షాంపూలు మార్చినా జుట్టు రాలడం తగ్గట్లేదా ?
ఈ లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే బ్లడ్ టెస్టులు,కంటి పరీక్షలు, లాలాజలం పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధిని ముందుగానే గుర్తిస్తే సరైన చికిత్సతో లక్షణాలను నియంత్రించి, దంతాలు, కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు దీర్ఘకాలిక సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. నిరంతరంగా పొడి కళ్లూ, పొడి నోరు ఉంటే స్వయంగా మందులు వాడకుండా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
