కల్వకుంట్ల కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఖమ్మం వేదికగా మరోసారి నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో కౌరవ వంశం అంటే అది కల్వకుంట్ల వంశమేనని.. ఆ కౌరవ వంశాన్ని రాష్ట్రంలో లేకుండా పాతాళానికి తొక్కుతాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ఎదుగుదలకు గుండెకాయ లాంటి ఖమ్మం ప్రజల సాక్షిగా ఆయన బీఆర్ఎస్ ముక్త తెలంగాణకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాటు రాక్షస పాలన సాగిందని మండిపడ్డ సీఎం రేవంత్ .. గత కేసీఆర్ మాయమాటలను నమ్మకుండా 2023లో ప్రజలు అద్భుతం సృష్టించారని, కేసీఆర్‌ను ఎక్కడికి పంపాలో అక్కడికే పంపించారని ఎద్దేవా చేశారు. తాను బీఆర్ఎస్‌ను కాదని కాంగ్రెస్‌లో చేరినప్పుడు జనం ఉప్పెనాలా తరలివచ్చారని గుర్తు చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 65 సీట్లు వస్తాయని తాను లెక్కలతో సహా చెబితే.. కొందరు నవ్వారని, కానీ అదే నిజమై చూపించామన్నారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గుండుసున్నా చుట్టించామని, బైపోల్స్, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తన సత్తా చాటుకుంటూనే ఉందన్నారు.
కేంద్రంలో బిల్లులను ఆమోదించుకునేందుకు ఇప్పుడు విపక్షాలను బీజేపీ పిలుస్తోందన్న సీఎం రేవంత్ .. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తెలంగాణలో 15 పార్లమెంట్ సీట్లు 26కు, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కి పెరుగుతాయని స్పష్టం చేశారు. 2029 జూన్‌లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 117కు పైగా స్థానాలు గెలుచుకుని, రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇది ఖమ్మం ప్రజల మాట.. ఆ భద్రాచలం రాముడి మీద ఆన అంటూ రేవంత్ బీఆర్ఎస్ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు.
