ప్రకృతి వింతా ? ఇక్కడ 'సాయంత్రం' అనేదే ఉండదు.. మధ్యాహ్నం దాటితే చీకటి.. ఈ ఊరి కథేంటో తెలుసా?

ప్రకృతి వింతా ? ఇక్కడ 'సాయంత్రం' అనేదే ఉండదు.. మధ్యాహ్నం దాటితే చీకటి.. ఈ ఊరి కథేంటో తెలుసా?

అక్కడ తెల్లారాలంటే ఏడు గంటల తర్వాతే... మధ్నాహ్నం దాటితే చీకటి పడుతుంది. ఆ ఊరి వాళ్లతో 'సాయంత్రం' అంటే చాలు... 'అంటే ఏంటి ? అని ఎదురు ప్రశ్నిస్తారు. ఇంతకీ ఈ పొద్దు తక్కువ పల్లె అక్కడెక్కడో విదేశాల్లో ఉందనుకుంటున్నారా.! కానేకాదు. అది ఉంది మన తెలంగాణలోనే...

పచ్చరంగు చీర తొడిగిన నల్లరాతి కొండలు, గుట్టలు. అక్కడక్కడా నింగిని తాకుతున్నట్టుండే తాటి చెట్లు... మధ్యలో ఎర్ర పెంకుల కప్పుతో కొలువుదీరిన పొదరిళ్లు. చూసినోళ్లకి ప్రకృతి సోయగమంతా ఆ ఊర్లోనే నెలవైందా అనిపించక మానదు. అసలైన పల్లె శోభకు అద్దంపట్టే ఆ గ్రామం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఉంది. ఈ ఊరి పేరు కొదురుపాక. తెలిసినోళ్లకు మాత్రం మూడు జాముల కొదురుపాకగా పేరు. ఉదయం, మధ్నాహ్నం, రాత్రి తప్ప, సాయంత్రాలు అంటే ఆ ఊరి ప్రజలకు తెలియదు. సాయంత్రం నాలుగు నుంచి ఉదయం ఏడు గంటల వరకు ప్రతి ఇంట్లో విద్యుత్ బల్బులు వెలగాల్సిందే.

పొద్దు పొడుపు ఆలస్యమే....
కొదురుపాకలో పొద్దు పొడుపును చూడాలంటే ఉదయం ఏడు గంటల తర్వాతే. ఆ ఊరిలో సాయంత్రం నాలుగు గంటలకే సంధ్యా రాగం మొదలవుతుంది. వర్షాకాలం, శీతాకాలాల్లో అయితే ఆ ఊరిలో సూర్యుడు అలస్యంగానే తొంగిచూస్తాడు. చుక్కలు మాత్రం త్వరగా వచ్చేస్తాయి. మధ్నాహ్నం మూడు గంటలకే మసక చీకటి ఆవరిస్తుంది. అయితే ఈ ప్రత్యేకత తెలుగు నాట ఒక్క కొదురుపాకకే సొంతం. మరే పల్లెల్లో చూడలేని ఈ ప్రకృతి అద్భుతాన్ని కొదురుపాకలోనే చూడగలం. అందుకే ఆ ఊరి గురించి తెలిసిన వాళ్లంతా 'మూడు
జాముల కొదురుపాక గా అభివర్ణిస్తారు. పొద్దు తక్కువ కావడంతో దానికి తగ్గట్టే గ్రామస్తుల దినచర్య సాగుతోంది. పొలం వెళ్లే పెద్దలు, బడికి పోయే పిల్లలు అందరూ సాయంత్రం ఐదింటికల్లా ఇంటికి చేరాల్సిందే. అప్పటికే ఊరిలో చీకటి అవుతుంది కనుక. మిగతాచోట్లతో పోలిస్తే కొదురుపాకకు సూర్యుడు గంట ఆలస్యంగా వస్తాడు. యాభై నిమిషాలు ముందే వెళతాడు.

ALSO READ : ఆపరేషన్ లేకుండ డాక్టర్లు బాడీ లోపల క్లియర్ గా ఎలా చూడగలుగుతున్నారు ?

అలా జరగడానికి....
ఒక్క కొదురుపాకలోనే పొద్దు తక్కువ ఎందుకనే ప్రశ్న చాలామంది మదిలో మెదలక మానదు. ఇప్పటివరకు అక్కడ పర్యావరణ శాస్త్రవేత్త లెవరూ అధ్యయనం చేసి కారణం కనుక్కోలేదు. కానీ ఆ గ్రామస్తులే తమ ఊరిలో మాత్రమే అలా ఎందుకు జరుగుతుందన్న ప్రశ్నకు ఊహ ద్వారా సమాధానం వెతుక్కున్నారు. అందులో రీజన్, లాజిక్ కూడా ఉందనుకోండి. కొదురుపాక నలుదిక్కులా నాలుగు గుట్టలున్నాయి. తూర్పున గొల్ల గుట్ట, పశ్చిమాన రంగనాయకుల గుట్ట, ఉత్తరం వైపున సంబాలాద్రి, దక్షిణాన పాంబండ గుట్లలు కొలువుదీరున్నాయి. వాటి మధ్యలో ఊరు ఉందన్నమాట. మబ్బులను చీల్చుకొనొచ్చే భానుడి సూర్యకిరణాలు భూమి మీద పడేందుకు ఆ ఎత్తైన కొండలే అడ్డు. వాటి మూలంగానే త్వరగా చీకట్లు అలుముకుంటాయి. దీన్ని తమ ఊరికి దేవుడు ఇచ్చిన కానుకగా భావిస్తారు స్థానికులంతా. పల్లెనానుకొని హుస్నేనిమియా వాగు ఏడాదంతా ప్రవహిస్తూ ఉండటం విశేషం. దీని ముందు వేసవి కూడా తలవంచిన సందర్భాలెన్నో.