ఆపరేషన్ లేకుండ డాక్టర్లు బాడీ లోపల క్లియర్ గా ఎలా చూడగలుగుతున్నారు ? CT స్కాన్ వెనుక ఉన్న అసలు కథ..

ఆపరేషన్ లేకుండ డాక్టర్లు బాడీ లోపల క్లియర్ గా ఎలా చూడగలుగుతున్నారు ?  CT స్కాన్ వెనుక ఉన్న అసలు కథ..

ఒకప్పుడు శరీరంలో ఎక్కడైనా గడ్డలు ఉన్నా,  రక్తస్రావం జరుగుతున్నా ఆపరేషన్ చేస్తే గానీ తెలిసేది కాదు. కానీ రాబర్ట్ లెడ్లీ అనే శాస్త్రవేత్త పుణ్యమా అని ఆ అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే  ఆయన కనిపెట్టిన CT స్కాన్ (కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ) సాంకేతికత ద్వారా ఇది సాధ్యమైంది. ఈ మిషన్ ఎక్స్-రే కిరణాలను, కంప్యూటర్ సాంకేతికతను కలిపి వాడుతుంది. ఇది మన శరీరాన్ని వేర్వేరు కోణాల నుండి ఫోటోలు తీసి, వాటన్నింటినీ కలిపి కంప్యూటర్ స్క్రీన్‌పై ఒక త్రీడీ (3D) చిత్రంలా చూపిస్తుంది. దీనివల్ల డాక్టర్లు ఎలాంటి ఆపరేషన్  లేకుండానే బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్ కణితులు, గుండె జబ్బులు, శరీర లోపలి గాయాలను చాలా సులువుగా గుర్తించగలుగుతున్నారు.

 మొట్టమొదటి పూర్తి శరీర CT స్కానర్ 
ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి శరీర CT స్కానర్ 1973లో అందుబాటులోకి వచ్చింది. రాబర్ట్ లెడ్లీ దీనిని తయారు చేసి, దానికి ACTA (ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ట్రాన్స్‌వర్స్ యాక్సియల్) అని పేరు పెట్టారు. అంతకుముందు కేవలం తల భాగాన్ని మాత్రమే స్కాన్ చేసే అవకాశం ఉండేది, కానీ ఈ మిషన్ వచ్చిన తర్వాత తల నుండి కాలి గోటి వరకు శరీరంలోని ఏ భాగాన్నైనా స్పష్టంగా చూడటం సాధ్యమైంది.

 రాబర్ట్ లెడ్లీ ఎవరు?
మెడికల్ రంగంలో కంప్యూటర్ల వాడకాన్ని విప్లవాత్మకంగా మార్చిన రాబర్ట్ లెడ్లీ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1926లో న్యూయార్క్‌లో జన్మించిన రాబర్ట్  లెడ్లీ మొదట దంతవైద్యంలో డిగ్రీ పూర్తి చేశారు. కానీ సైన్స్ మీద ఉన్న ఇష్టంతో ఆ తర్వాత ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.

ALSO READ : :రాత్రిపూట భయంతో నిద్రపట్టడం లేదా..

యూఎస్ ఆర్మీలో డెంటిస్ట్‌గా పనిచేస్తున్నప్పుడు కూడా ఆయన భౌతికశాస్త్రం, గణిత సూత్రాలను ఉపయోగించి దంతాల నిర్మాణంపై పరిశోధనలు చేశారు. 1950ల కాలంలో కంప్యూటర్లు ఆప్పుడప్పుడే వస్తున్న రోజుల్లోనే.. భవిష్యత్తులో ఇవి వైద్య రంగ రూపురేఖలను మార్చేస్తాయని ఆయన నమ్మారు. 1959లోనే దీనిపై ఒక ముఖ్యమైన పరిశోధనా పత్రాన్ని రాశారు.

ఆయనకు దక్కిన గౌరవం
రాబర్ట్ లెడ్లీ చేసిన ఈ గొప్ప ఆవిష్కరణ వైద్య ప్రపంచాన్ని ఎంతగానో మార్చేసింది. అందుకే ఆయన తయారు చేసిన మొట్టమొదటి CT స్కానర్ మిషన్‌ను అమెరికాలోని ప్రసిద్ధ స్మిత్సోనియన్ మ్యూజియంలో నేటికీ ఒక అపురూపమైన వస్తువుగా భద్రపరిచారు. ఆయన తన జీవితకాలంలో 300కు పైగా పరిశోధనా పత్రాలు రాశారు, 10కి పైగా పేటెంట్లు సాధించారు.

అమెరికా ప్రభుత్వం నుండి అత్యున్నతమైన 'నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ' (1997) తో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 2012 జూలై 24న ఆయన కన్నుమూసిన, ఆయన కనిపెట్టిన సాంకేతికత నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షల మంది ప్రాణాలను కాపాడుతూనే ఉంది.