4 దేశాలను గజగజ వణిస్తున్న శక్తివంతమైన తుఫాన్ : భారతదేశంపై ప్రభావం ఎంత..?

4 దేశాలను గజగజ వణిస్తున్న శక్తివంతమైన తుఫాన్ : భారతదేశంపై ప్రభావం ఎంత..?

సముద్రంలో తుఫాన్లు కామన్.. చాలా అరుదుగా అత్యంత శక్తివంతమైన తుఫాన్ లు ఏర్పడుతుంటాయి.. అలాంటిదే ఈ బావి తుఫాన్. ఇది ఎంత శక్తివంతమైంది అంటే దీని కన్ను.. అంటే తుఫాన్ కేంద్రీకృతమైన ప్రాంతం వెయ్యి కిలోమీటర్లు విస్తరించి ఉంది. అందుకే దీన్ని సూపర్ టైఫూన్ గా చెబుతున్నారు అధికారులు. దీనికి బావి అని పేరు పెట్టారు. ఈ బావి భారీ తుఫాన్ ఏయే దేశాలపై ప్రభావం చూపించనుంది.. ఎటు వెళుతుంది.. భారతదేశంపై ప్రభావం ఎంత అనేది తెలుసుకుందాం..

బావి భారీ తుఫాన్ పేరు ఎవరు పెట్టారు :

బావి అనే పేరును వియత్నాం దేశం పెట్టింది. వియత్నాం దేశంలోని హనోయ్ ప్రాంతంలో ఉన్న జాతీయ పార్కు పేరు ఇది. ఆ పేరును సూచిస్తూ బావిగా పెట్టారు ఈ తుఫాన్ కు. 

బావి తుఫాన్ పరిధి ఎంత? :

పసిఫిక్ మహా సముద్రం మీదుగా వెళుతుంది ఈ తుఫాన్. వెయ్యి కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. తూర్పు ఆసియా దేశాల్లోనే అతి పెద్ద తుఫాన్ గా దీన్ని చెబుతున్నారు అధికారులు. దీని పరిమాణం వెయ్యి కిలోమీటర్లుగా ఉండటంతోపాటు.. తీరం దాటే సమయంలో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ క్రమంలోనే తీర ప్రాంతంలో విధ్వంసం భారీగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. 

ఏయే దేశాలపై ప్రభావం : 

ఈ బావి తుఫాన్ నాలుగు దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తైవాన్ దేశానికి ఉత్తర దిశగా వెళుతుండటంతో.. ఇప్పటికే అక్కడ కుండపోత వర్షాలు పడుతున్నాయి. బలమైన ఈదురుగాలులతో బీభత్సం చేసింది. కొండ చరియలు విరిగి పడినట్లు చెబుతున్నారు అధికారులు. తీర ప్రాంతాల్లో లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్యవసర సేవల కోసం 30 వేల మంది సైన్యాన్ని సిద్ధం చేసింది తైవాన్ ప్రభుత్వం. తైవాన్ తీర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడుతుండటంతో.. సహాయ చర్యలు చేపట్టారు అధికారులు. 

చైనా 

ఇక చైనా అయితే దారుణంగా ఉంది. చైనా ఆగ్నేయ తీర ప్రాంతం అయిన ఫుజియాన్ ప్రావిన్స్, జెజియాంగ్ ప్రాంతాలపై బావి తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. 6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతాల్లోనే ఆదివారం తీరం  దాటనున్నట్లు సమాచారం ఉండటంతో.. చైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టింది. 

జపాన్ 

ఇక జపాన్ దేశంపైనా బావి తుఫాన్ ప్రభావం ఉంది. సకిషిమా దీవుల్లో కుండపోత వర్షాలు, ఈదురుగాలులతో బీభత్సం చేస్తుంది. సముద్రం అల్లకల్లోలం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎవరూ బయటకు రావొద్దని ఇప్పటికే జపాన్ ప్రభుత్వం హెచ్చరించింది. సముద్రానికి దగ్గరగా ఉంటే ప్రజలు అంతా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది జపాన్ ప్రభుత్వం. 

ఫిలిప్పీన్స్

ఇక ఫిలిప్పీన్స్ దేశంపైనా బావి తుఫాన్ ఎఫెక్ట్ ఉంది. మిండానో ద్వీపంలో భారీ వర్షాలతో కొండ చరియలు విరిగి పడ్డాయి. 15 మంది చనిపోయారు. చెట్లు కూలిపోయాయి. చాలా మంది గల్లంతు అయినట్లు వార్తలు వస్తున్నాయి. కుండపోత వర్షాలతో దక్షిణ ఫిలిప్పీన్స్ లో భారీ నష్టం జరిగినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. 

 భారతదేశం

నాలుగు దేశాలను అల్లకల్లోలం చేస్తున్న బావి తుఫాన్ భారతదేశంపై ప్రభావం చూపిస్తుందా అంటే.. ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం చూపించదని చెబుతున్నారు అధికారులు. నైరుతి రుతుపవనాల విస్తరణ బంగాళాఖాతం, అరేబియా సముద్రంగా మీదుగా ఉంటాయని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే తూర్పు ఆసియాలోనే అతి పెద్ద.. వెయ్యి కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన అత్యంత శక్తివంతమైన బావి తుఫాన్ కారణంగా.. నైరుతి రుతు పవనాల విస్తరణకు ఆటంకం కలిగించాయనే ప్రచారం సైతం నడుస్తుంది. రుతు పవనాలను వెనక్కి లాగేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా.. అధికారికంగా అలాంటిది ఏమీ లేదు అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.