వియత్నాంలో పడవ ప్రమాదంలో తెలంగాణ, ఏపీకి చెందిన 32 మంది గల్లంతైనట్లు గుర్తించారు. వీరిలో ఏపీకి చెందిన ముగ్గురు టూరిస్టుల మృతదేహాలను ఐడెంటిఫై చేశారు.మిగతా వారిని గుర్తించాల్సి ఉంది.మృతుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు కడపకు చెందిన శ్రీధర్, హిందూపూర్ కు చెందిన రవితేజ, మచిలీపట్నం కు చెందని జయశ్రీలు చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే ఏపీకి చెందిన మరోవ్యక్తి బోటు ఎక్కక పోవడంతో ప్రాణాలతో బయటపడ్డట్టు తెలుస్తోంది.
శనివారం (జూలై11) వియత్నాంలో స్పీడ్ బోటు సముద్రంలో మునిగిపోయింది. ఫు క్వాక్ ద్వీప సమూహంలోని హాన్ మే రట్ న్గోయ్ సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న స్పీడ్‌బోట్ బోల్తా పడటంతో 18 మంది భారతీయులు మృతి చెందినట్లు వియత్నాం అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో బోట్‌లో మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు. వీరంతా ప్రముఖ నోవా మొబైల్ కంపెనీ కి చెందిన 250 మంది డిస్ట్రిబ్యూటర్లు. ఆ కంపెనీ ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూటర్లకు వియత్నాం ట్రిప్ ఏర్పాటు చేసింది.
ALSO READ : 4 దేశాలను గజగజ వణిస్తున్న శక్తివంతమైన తుఫాన్
ప్రమాదం అనంతరం కోస్ట్ గార్డ్, నౌకాదళం, స్థానిక రెస్క్యూ బృందాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు 21 మందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. సముద్రంలో గల్లంతైన వారి కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. సహాయక బృందాలు సముద్రం నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నాయి.
ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన పర్యాటకులు ఉన్నారు. అయితే మృతుల పూర్తి వివరాలను అధికారులు ఇంకా సేకరిస్తున్నారు. చనిపోయిన వారి పేర్ల లిస్టును ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, బాధితులకు అవసరమైన సహాయం అందిస్తున్నట్లు తెలిపింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం లేదా అత్యవసర సహాయం కోసం భారతీయులు +84 91 308 9165, +84 36 281 7930 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించింది.
