వెస్టిండీస్కి బిగ్ షాక్.. వన్డే క్రికెట్‌కు జేసన్ హోల్డర్ రిటైర్మెంట్.. కోచ్ సామీ సంచలన ప్రకటన!

వెస్టిండీస్కి బిగ్ షాక్.. వన్డే క్రికెట్‌కు జేసన్ హోల్డర్ రిటైర్మెంట్.. కోచ్ సామీ సంచలన ప్రకటన!

Jason Holder Retirement: వెస్టిండీస్ క్రికెట్ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. విండీస్ క్రికెట్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసేలా.. స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ వన్డే అంతర్జాతీయ (ODI) క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు జట్టు ప్రధాన కోచ్ డారెన్ సామీ సంచలన ప్రకటన చేశాడు. ప్రముఖ విజ్డన్ క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. హోల్డర్ భవిష్యత్తు గురించి ప్రస్తావనకు రాగా, ఈ విషయాన్ని అనూహ్యంగా బయటపెట్టాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రిటైర్మెంట్‌పై జేసన్ హోల్డర్ తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల ద్వారా కానీ లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.. కోచ్ నోటి గుండా మాత్రమే ఈ వార్త మొదటగా బయటకు వచ్చింది.  

టెస్టులపై నా మొగ్గు.. కోచ్ సామీ పాడ్‌కాస్ట్ వైరల్:
పాడ్‌కాస్ట్‌లో కోచ్ డారెన్ సామీ మాట్లాడుతూ.. జేసన్ హోల్డర్ భవిష్యత్తు ప్రణాళికలపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు. అతడు వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకున్నప్పటికీ, విండీస్ జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ (Red-ball Cricket) ఆడేందుకు మాత్రం విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నాడని హెడ్ కోచ్ కన్ఫర్మ్ చేశాడు. ప్రస్తుతం హోల్డర్ వివిధ గ్లోబల్ లీగ్స్‌లో ఫ్రాంచైజీ ప్లేయర్‌గా కూడా బిజీగా ఉన్నాడని, అందువల్ల అతని షెడ్యూల్, మేనేజ్‌మెంట్ ప్రణాళికలు ఒకేతాటిపైకి వచ్చినప్పుడు విండీస్ టెస్ట్ జట్టులోకి అతన్ని ఖచ్చితంగా తీసుకుంటామని తెలిపాడు. హోల్డర్ లేని సమయంలో జస్టిన్ గ్రీవ్స్ ఆల్‌రౌండర్‌గా జట్టులో తన పాత్రను అద్భుతంగా పోషిస్తున్నాడని, ఇది తమ బెంచ్ బలాన్ని మరింత పెంచిందని కోచ్ సామీ కొనియాడాడు.

ముగిసిన సుదీర్ఘ ప్రస్థానం.. జేసన్ హోల్డర్ వన్డే కెరీర్:
హెడ్ కోచ్ డారెల్ సామీ చేసిన వ్యాఖ్యలే నిజమైతే.. వెస్టిండీస్ క్రికెట్‌లో ఒక సువర్ణ అధ్యాయం ముగిసినట్లే భావించవచ్చు.. జేసన్ హోల్డర్ 2013 నుంచి 2023 మధ్య కాలంలో కరెబీయన్ జట్టు తరపున మొత్తం 138 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. మిడిల్ ఆర్డర్‌లో ఎన్నోసార్లు జట్టును ఆదుకున్న హోల్డర్ 24.85 యావరేజ్‌తో 11 హాఫ్ సెంచరీలతో కలిపి మొత్తం 2,237 రన్స్ చేశాడు. ఇక బౌలింగ్ విభాగంలోనూ తన 6 అడుగుల 7 అంగుళాల ఎత్తును ఉపయోగించుకుని 159 వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్ చరిత్రలో 1000 పరుగులు, 100 వికెట్లతో పాటు 50కి పైగా క్యాచ్‌లు పట్టిన అతికొద్ది మంది అరుదైన ఆల్‌రౌండర్ల జాబితాలో హోల్డర్ ఒకడిగా నిలిచాడు.  

లీడర్‌షిప్ మార్క్.. విండీస్ నయా వన్డే ప్లాన్స్ ఏంటి?: 
కేవలం ప్లేయర్ గానే కాకుండా వెస్టిండీస్ వన్డే మ్యాచ్‌లకు హోల్డర్ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును ముందుండి నడిపించాడు. పీక్ స్టేజ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ వన్డేల నుంచి తప్పుకోవడం విండీస్ కు పెద్ద లోటే అయినప్పటికీ, భవిష్యత్తు తరాలను సిద్ధం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఒత్తిడి సమయాల్లో ప్రశాంతంగా ఉంటూ జట్టుకు దిశా నిర్దేశం చేసే హోల్డర్ స్థానాన్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదు. దీంతో జేసన్ హోల్డర్ వన్డే రిటైర్మెంట్‌పై విండీస్ క్రికెట్ బోర్డు లేదా స్వయంగా హోల్డర్ నుంచి అధికారిక ప్రెస్ నోట్ ఎప్పుడు వస్తుందా అని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు.