- సూపర్ ఫామ్‌లో టీమిండియా
- పరువు కోసం కివీస్ పాకులాట
- మ. 12.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో లైవ్
వెల్లింగ్టన్: గత ఆరేళ్లుగా షార్ట్ ఫార్మాట్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఇండియా.. న్యూజిలాండ్‌తో మూడో టీ20 మ్యాచ్‌కు రెడీ అయ్యింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో తిరుగులేని పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన టీమిండియా.. మంగళవారం జరిగే ఈ పోరులో గెలిచి ఇక్కడే సిరీస్ పట్టేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2020లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా.. కివీస్‌ను 5–0తో వైట్‌వాష్ చేసింది.
ఆ తర్వాత 2022–23లో జరిగిన టూర్‌లో వాతావరణం కారణంగా కొన్ని మ్యాచ్‌లు రద్దు కాగా, ఒక మ్యాచ్‌లో ఇండియా గెలిచింది. నిర్ణయాత్మక మ్యాచ్ టైగా ముగిసింది. దాంతో ఈ సిరీస్‌ను కూడా సొంతం చేసుకోవాలని ఇండియా పట్టుదలగా కనిపిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ చేజారకుండా చూసుకోవాలని కివీస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇషాన్ దూరం..
గాయంతో రెండో మ్యాచ్‌కు దూరమైన ఇషాన్ కిషన్ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా తను ఆడటం లేదు. ఇషాన్ ప్లేస్‌లో వచ్చిన వైభవ్ సూర్యవంశీ గాడిలో పడాల్సి ఉంది. అభిషేక్ శర్మ కూడా బ్యాట్ ఝుళిపించాలి. వెల్లింగ్టన్‌లో చల్లని గాలులు ఎక్కువగా వీస్తుండటంతో ఈ ఇద్దరికి బ్యాటింగ్ కఠిన పరీక్షగా మారనుంది. మిగతా లైనప్‌లో పెద్దగా మార్పుల్లేవు. సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్ ఫామ్‌ను చూపెట్టాల్సి ఉంది. తెలుగు బ్యాటర్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌ను గెలిపిస్తుండటం ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. నమన్ ధీర్ ఊహించని రీతిలో సత్తా చాటడం టీమిండియాకు అదనపు బలంగా మారింది. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్, అర్ష్‌దీప్‌పై ప్రత్యేక దృష్టి నెలకొంది. భువీ తొలి రెండు మ్యాచ్‌ల్లో 49, 50 రన్స్ ఇవ్వడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. మయాంక్ యాదవ్‌లో డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ ప్రిన్స్ యాదవ్ రావడం పేస్ బౌలింగ్ బలాన్ని పెంచింది.
రెండు మార్పులతో..
ఈ మ్యాచ్ కోసం కివీస్ రెండు మార్పులు చేసింది. గత మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన మ్యాట్ హెన్రీతో పాటు ఫెర్గుసన్‌ను తప్పించారు. రాబోయే సిరీస్‌ల దృష్ట్యా ఈ ఇద్దర్ని పక్కనబెట్టారు. వీళ్ల ప్లేస్‌లో మ్యాట్ ఫిషర్, బ్లెయిర్ టిక్నెర్‌ను జట్టులోకి తీసుకొచ్చారు. ఆడమ్ మిల్నే, కైల్ జెమీసన్ కూడా అందుబాటులో ఉండనున్నారు. బ్యాటింగ్‌లో ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, డారిల్ మిచెల్‌తో కూడిన టాప్ ఆర్డర్ బ్యాట్లు ఝుళిపించాల్సి ఉంది. మిడిలార్డర్‌లో గ్లెన్ ఫిలిప్స్, జాకబ్స్ కీలకం కానున్నారు. స్పిన్నర్ శాంట్నర్ నుంచి ఇండియాకు ముప్పు పొంచి ఉంది.
తుది జట్లు (అంచనా)
ఇండియా: శ్రేయస్ (కెప్టెన్), అభిషేక్, శాంసన్, వైభవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ కుమార్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్: శాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, బెవాన్ జాకబ్స్ / డేవన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైకేల్ బ్రాస్‌వెల్, నాథన్ స్మిత్, కైల్ జెమీసన్, ఆడమ్ మిల్నే, జాకబ్ డఫీ.
