వియత్నాంలో బోటు ప్రమాదం : నదిలో కొట్టుకుపోయిన భారతీయ టూరిస్టులు

వియత్నాంలో బోటు ప్రమాదం : నదిలో కొట్టుకుపోయిన భారతీయ టూరిస్టులు

వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫు క్వాక్ దీవి సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందిస్తూ.. స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 32 మంది భారతీయ టూరిస్టులు ప్రమాదం సమయంలో బోటులో ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ ఈ ప్రమాదంలో దాదాపు 18 మంది మరణించారని తెలుస్తోంది. మృతుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన టూరిస్టులు అధికంగా ఉన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే వియత్నాం స్థానిక అధికారులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. పడవలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు.. వారిలో ఎంతమంది భారతీయులు ఉన్నారు, ఎంతమంది సురక్షితంగా బయటపడ్డారు అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం సహాయక బృందాలు సముద్ర ప్రాంతంలో గాలింపు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనను ధృవీకరించింది. “ఇది విషాదకరమైన ఘటన. స్థానిక అధికారులతో కలిసి పరిస్థితిని పరిశీలిస్తున్నాం. రెస్క్యూ ఆపరేషన్లకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నాం” అని పోస్ట్ చేసింది. 

ఫు క్వాక్ దీవి వియత్నాంలో ఫేమస్ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం వేలాది మంది విదేశీ పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇలాంటి సముద్ర ప్రయాణాల్లో భద్రతా ప్రమాణాలు, లైఫ్ జాకెట్ల వినియోగం, వాతావరణ పరిస్థితుల అంచనా వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. గతంలో కూడా వియత్నాంలో పర్యాటక పడవ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై భారత పర్యాటకుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారి వివరాలు, ప్రస్తుత పరిస్థితిపై అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. భారత రాయబార కార్యాలయం స్థానిక యంత్రాంగంతో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటోంది.