ఒకప్పుడు జనాభా పెరుగుదలే ప్రపంచానికి పెద్ద సవాలుగా ఉండేది. ఇప్పుడు మాత్రం మరో కొత్త సమస్య తలెత్తుతోంది.. అదే సంతానోత్పత్తి తగ్గుదల. ప్రపంచ జనాభా ఒక బిలియన్‌కు చేరుకోవడానికి లక్షల సంవత్సరాలు పట్టింది. కానీ ఆ తర్వాత కేవలం రెండు శతాబ్దాల్లోనే జనాభా ఏడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 8 బిలియన్లకు పైగా ఉంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. జనాభా పెరుగుతున్నప్పటికీ, పిల్లలను కనాలనే ఆసక్తి మాత్రం చాలా దేశాల్లో తగ్గుతోంది. ఫలితంగా సంతానోత్పత్తి రేటు పాపులేషన్ కంట్రోల్ సూచి కంటే కనిష్టానికి పడిపోయింది. జూలై 11న వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా ప్రస్తుత జనాభా, పరిణామాలు, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటో చూద్దాం.
1970లలో ఒక మహిళ సగటున 4.5 మంది పిల్లలకు జన్మనిచ్చేది. కానీ ఇప్పుడు ప్రపంచ సగటు సంతానోత్పత్తి రేటు 2.5 కంటే తక్కువకు పడిపోయింది. అంతేకాదు.. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది ఇప్పుడు జనాభా స్థిరత్వానికి అవసరమైన కనీస స్థాయి 2.1 కంటే తక్కువ సంతానోత్పత్తి రేటు ఉన్న దేశాల్లోనే నివసిస్తున్నారు.
దీనికి అనేక కారణాలు ఉన్నాయి. చదువు, ఉద్యోగాలు, నగర జీవనం, పెరుగుతున్న జీవన వ్యయం, ఉద్యోగ భద్రత లేకపోవడం, ఆలస్య వివాహాలు, కెరీర్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు యువత నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. చాలామంది యువత పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారుతున్నాయని తాజా సర్వేలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆయుర్దాయం (జీవన ప్రమాణం) కూడా పెరుగుతోంది. వైద్య రంగం అభివృద్ధితో ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఫలితంగా వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. అయితే యువ జనాభా తగ్గితే భవిష్యత్తులో పని చేసే వయస్సు ఉన్న వారి సంఖ్య తగ్గిపోతుంది. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, ఉత్పత్తి, పెన్షన్ వ్యవస్థ, ఆరోగ్య సేవలపై పడే అవకాశం ఉంది.
పట్టణీకరణ కూడా వేగంగా పెరుగుతున్న విషయం తెలిసిందే.. 2007లో తొలిసారి గ్రామాల కంటే నగరాల్లో ఎక్కువ మంది నివసించడం మొదలు పెట్టారు. 2050 నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు 66 శాతం మంది నగరాల్లోనే జీవిస్తారని అంచనా. ఈ మార్పులకు అనుగుణంగా ప్రభుత్వాలు విద్య, ఆరోగ్యం, గృహవసతి, తాగునీరు, ఉపాధి, రవాణా వంటి రంగాల్లో ముందస్తు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది.
2026 ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్
"యువత ఆశలు, ఆకాంక్షలను సాకారం చేయడం– నేడు,భవిష్యత్తు కోసం"
73 దేశాల్లో లక్షకు పైగా యువతపై నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 81 శాతం మంది యువత.. పెళ్లి చేసుకోవడం, లైఫ్ పార్టినర్ ను ఎంచుకోవడంలో ఆర్థిక భద్రతే ప్రధాన అంశంగా చెప్పారు. ఇల్లు, ఉద్యోగం, ఆదాయం వంటి సమస్యలే మ్యారేజ్ లైఫ్ లోకి ఎంట్రీకీ అతిపెద్ద అడ్డంకిగా భావిస్తున్నారు. ఒకరు ఇద్దరు పిల్లలను కని, సాకడమే మా ఎక్కువ.. చిన్న కుటుంబమే ఆదర్శమని ఎక్కువ మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వరల్డ్ పాపులేషన్ డే మెసేజ్..
జనాభా ఎక్కువగా ఉండటం సమస్య అయితే, అతిగా తగ్గిపోవడం కూడా భవిష్యత్తుకు సవాలే. అందుకే కుటుంబంపై నిర్ణయం ప్రతి జంట వ్యక్తిగత హక్కు అయినప్పటికీ, వారు తమ నిర్ణయాన్ని స్వేచ్ఛగా తీసుకునేలా సమాజం, ప్రభుత్వాలు అనుకూల వాతావరణాన్ని కల్పించాలి. యువతకు మంచి విద్య, స్థిరమైన ఉద్యోగాలు, నాణ్యమైన ఆరోగ్యసేవలు, పిల్లల సంరక్షణకు అవసరమైన సపోర్టు ఉంటేనే వారు తమ కుటుంబ భవిష్యత్తుపై ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలరు.
ఆరోగ్యవంతమైన సమాజం, ఆత్మవిశ్వాసంతో ఉన్న యువత, సమతుల్య జనాభా... ఇవే భవిష్యత్తు ప్రపంచానికి నిజమైన బలం. ప్రపంచ జనాభా దినోత్సవం మనందరికీ ఈ సందేశాన్నే గుర్తు చేస్తోంది.
