షాబాద్ బాధిత కుటుంబానికి ..ఇందిరమ్మ ఇల్లు, రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ

షాబాద్  బాధిత కుటుంబానికి ..ఇందిరమ్మ ఇల్లు, రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. కలెక్టర్ హామీతో  ఆందోళన విరమణ

షాబాద్  ఘటన బాధిత కుటుంబానికి  ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి  భరోసా ఇచ్చారు. బాధితులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించడంతో పాటు, ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు.  ఆందోళన నిర్వహిస్తున్న బాధిత కుటుంబ సభ్యులు, ఆందోళనకారులతో స్వయంగా మాట్లాడారు. 

ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన షాబాద్ ఎస్ఐ (SI) రమేష్‌ను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులోని ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరుపుతామని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు. కలెక్టర్ నారాయణరెడ్డి స్వయంగా వచ్చి పూర్తి న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో, బాధితుల కుటుంబం తమ ఆందోళనను విరమించింది.

మరోవైపు.. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అడ్మిన్ డీసీపీ చందనా దీప్తి మాట్లాడుతూ.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు. నిందితుడి లొకేషన్ ఇప్పటికే ట్రేస్ అయ్యిందని, ఓ ముఖ్యమైన లీడ్ లభించిందని చెప్పారు. అతి త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ స్పష్టం చేశారు.

మైనర్ పై అత్యాచార వేధింపుల ఆరోపణలతో.. పోక్సో కేసులో అరెస్టెన  రాజ్ కుమార్ .. బెయిల్ పై బయటికొచ్చి  ఆరుగురిని చంపేశాడు దుర్మార్గుడు. శుక్రవారం (జులై 10) అర్థరాత్రి రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

 కిరాతకకుడు.. మొదటగా ఇంటికి వెళ్లి తన భార్య, ఇద్దరు పిల్లలను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత పోక్సో కేసు పెట్టిన బాధిత బాలిక కుటుంబంలో మరో ముగ్గురిని హత్య చేశాడు. బాలికను వేధించినందుకు రాజ్ కుమార్ పై  మే 16న పోక్సో కేసు నమోదైంది. మే 26న అరెస్ట్ అయి జైలుకెళ్లిన దుర్మార్గుడు.. శుక్రవారం (జులై 10) బెయిల్పై తిరిగి వచ్చి అత్యంత కిరాతకంగా దారుణానికి ఒడిగట్టాడు. ఇంటికి వెళ్లి తన భార్య, ఇద్దరు పిల్లల హత్య చేశాడు. ఆ తర్వాత బాధిత బాలిక, బాలిక తల్లి, నాయనమ్మలను హత్య చేశాడు. బాలికను ఊరి శివారల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు.ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.