మైలేజ్ తక్కువ.. తయారీ ఖర్చు ఎక్కువ: అయినా E20 పెట్రోలే అమ్ముతామంటున్న మోడీ సర్కార్

మైలేజ్ తక్కువ.. తయారీ ఖర్చు ఎక్కువ: అయినా E20 పెట్రోలే అమ్ముతామంటున్న మోడీ సర్కార్

దేశవ్యాప్తంగా కార్లు, బైక్స్ ఓనర్ల నుంచి వస్తున్న అభ్యంతరాల మధ్య కేంద్ర ప్రభుత్వం ఈ20 పెట్రోల్ విషయంలో వెనక్కి తగ్గే సంకేతాలు ఇవ్వడం లేదు. మైలేజ్ 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని, ప్రస్తుత క్రూడ్ ఆయిల్ ధరల వద్ద ఈ20 తయారీ ఖర్చు సాధారణ పెట్రోల్ కంటే ఎక్కువేనని అంగీకరించినప్పటికీ ఇథనాల్ కలిపిన పెట్రోల్ మాత్రమే అమ్మాలని మోడీ సర్కార్ డిసైడ్ అయ్యింది. పైగా ఈ ఇథనాల్ తయారీ, ప్రోత్సాహం కోసం దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఇప్పటి వరకూ ఇన్వెస్ట్ చేశాం వెనక్కి తగ్గటం కుదరదని చెబుతోంది కేంద్ర ప్రభుత్వం.

80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ కలయికతో తయారయ్యే ఈ20 ఇప్పుడు దేశవ్యాప్తంగా సాధారణ పెట్రోల్‌గా మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే వాహనదారులు మాత్రం పాత వాహనాలపై ప్రభావం, తక్కువ మైలేజ్, అదనపు ఖర్చులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రబ్బర్ ఇంజన్ పార్ట్స్, స్పేర్స్ దెబ్బతినొచ్చనే రిపోర్టులతో పాత వాహనాల ఓనర్లు ఆ ఖర్చు ఎవరు భరిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ మాత్రం మొక్కజొన్న ఆధారిత ఇథనాల్‌ను లీటరుకు సుమారు రూ.71.86కు కొంటోందట. దీనికి జీఎస్టీ, రవాణా, నిల్వ ఖర్చులు కలిపితే ప్రస్తుత బ్యారెల్ క్రూడ్ ధరలు 70 డాలర్ల వద్ద ఉన్నప్పుడు ఈ20 తయారీ ఖర్చు స్వచ్ఛమైన పెట్రోల్ కంటే ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వమే అంగీకరించింది. అయితే క్రూడ్ ధరలు 120-130 డాలర్లకు చేరితే పరిస్థితి మారుతుందని చెబుతోంది. ఎప్పుడో ఒకసారి అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా పెరిగి క్రూడ్ కోసం రోజూ ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మటం ఏంటి అనే వాదన కూడా వాహనదారుల నుంచి వినిపిస్తోంది. కొందరైతే తమ వెహికల్స్ పాడైతే లక్షలు వేలు ఖర్చు చేయటం కంటే కొద్దిగా రేటెక్కువ అయినా ప్యూర్ పెట్రోల్ కొనుక్కోవటం మంచిదని అనుకుంటున్నారు. 

ప్రభుత్వం దృష్టిలో ఈ20 లక్ష్యం రోజువారీ ఇంధన ధర తగ్గించడం కాదు.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారాన్ని తగ్గించడం. కొన్ని వాహనాల్లో 3-5 శాతం మైలేజ్ తగ్గొచ్చని కేంద్రం చెబుతున్నప్పటికీ వాస్తవంగా అది ఇంకా ఎక్కువనే ఉంటుందని యూజర్స్ అంటున్నారు.

ALSO READ : బహమాస్‌లో ఘోర విమాన ప్రమాదం..

ప్రస్తుతం ఈ20పై విమర్శలు ఉన్నప్పటికీ.. ఇథనాల్ పరిశ్రమలో పెట్టుబడులు, రైతులకు ఆదాయం, విదేశీ మారకద్రవ్య ఆదా వంటి అంశాలను చూపిస్తూ కేంద్రం ఈ విధానం నుంచి వెనక్కి వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేస్తోంది. మైలేజ్ సమస్యలు ఉన్నా.. దీర్ఘకాల ప్రయోజనాల పేరుతో ఈ20 ప్రయాణాన్ని కొనసాగించాలన్నదే మోదీ సర్కార్ వైఖరిగా కనిపిస్తోంది.