నోయిడాలో ఓ సాధారణ డెలివరీ కోసం బుక్ చేసిన పోర్టర్ రైడ్.. ఒక మనిషి జీవితంలోని అసాధారణ పోరాటాన్ని బయటపెట్టింది. సామాజిక కార్యకర్త కిరణ్ వర్మకు ఇది కేవలం రూ.40 విలువైన లెటర్ డెలివరీ కాదు.. ఉద్యోగం కోల్పోయిన ఓ పెద్దాయన ఆవేదన గురించి తెలిసిన క్షణంగా మారింది. తన ఇంటికి వచ్చిన పోర్టర్ డెలివరీ భాగస్వామి వయసు సుమారు 56 ఏళ్లు. వృద్ధుడిలా కనిపించినా, అతని మాట తీరు, ప్రవర్తనలో ఓ ప్రొఫెషనల్ స్థాయి కనిపించిందని వర్మ చెప్పారు. మెట్లెక్కి వచ్చి పార్సిల్ తీసుకున్న ఆ వ్యక్తి నీళ్లు ఇచ్చినా వద్దని చెప్పి చిరునవ్వుతో తన పని చేసుకున్నాడు. అయితే అతని ముఖంలో కనిపించిన అలసట వర్మ దృష్టిని ఆకర్షించింది.
“ఈరోజు పని లేదు.. పని కోసం ఎదురుచూస్తున్నాను” అని ఆ రైడర్ చెప్పిన మాటలు వర్మను కదిలించాయి. సాధారణంగా డెలివరీ చేసే వ్యక్తిగా చూసిన ఆయనలో ఒకప్పుడు కార్పొరేట్ ఉద్యోగి ఉన్నాడని తెలుసుకుని వర్మ ఆశ్చర్యపోయారు. ఆ రైడర్ తన పేరు మనోజ్ అని, 56 ఏళ్ల వయసులో ఉన్నానని చెప్పినట్లు వర్మ తెలిపారు. గతంలో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 14 సంవత్సరాలు పనిచేశానని.. 2023లో లేఆఫ్ కారణంగా ఉద్యోగం కోల్పోయానని మనోజ్ చెప్పారు. వయసు, ఆరోగ్య కారణాలతో తిరిగి ఉద్యోగం దొరకడం కష్టమై చివరకు గిగ్ వర్క్‌పై ఆధారపడాల్సి వచ్చిందని తన స్టోరీ వెళ్లడించారు రైడర్ మనోజ్.
లేఆఫ్ గురించి అడిగినప్పుడు మనోజ్ చెప్పిన ఒక ఉపమానం అందరినీ ఆలోచింపజేసింది. “బేటా.. కూర చేసేటప్పుడు కరివేపాకును మొదట వేస్తారు. కానీ కూర తినేటప్పుడు మాత్రం మొదట బయటకు తీసేస్తారు” అని మనోజ్ పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల అనుభవంతో సంస్థలను నిలబెట్టిన ఉద్యోగులు అవసరం తీరిన తర్వాత పక్కన పడేయబడుతున్నారనే బాధ ఆ పెద్దాయన మాటల్లో కనిపించింది. లేఆఫ్ కు కారణం తెలియనప్పటికీ మనోజ్ చెప్పిన మాటలు నేటి ఉద్యోగ ప్రపంచంలోని ఒక చేదు వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు వర్మ.
ALSO READ : E20 పెట్రోల్‌పై 9 అనుమానాలు ఇవే..
వీడ్కోలు సమయంలో వర్మ డెలివరీ ఛార్జీ కంటే ఎక్కువ మొత్తాన్ని కృతజ్ఞతగా ఇచ్చారు. అది కేవలం డబ్బు సహాయం కాదు.. ఒక మనిషి కష్టాన్ని మరో మనిషి గుర్తించిన చిన్న ప్రయత్నం. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. వయసు పెరిగిన ఉద్యోగులకు అవకాశాలు తగ్గడం, అనుభవానికి తగిన విలువ దక్కకపోవడం, ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వంటి అంశాలపై పలువురు స్పందించారు. మనోజ్ స్టోరీ ఒక వ్యక్తి బాధ మాత్రమే కాదు.. మారుతున్న ఉద్యోగ మార్కెట్‌లో వేలాది మంది అనుభవజ్ఞుల మౌన పోరాటానికి ప్రతిబింబం.
