ఒక్క మ్యాచ్.. 1605 రోజుల రికార్డుకు ఎండ్ కార్డ్?.. భారత్ మెడపై ఇంగ్లాండ్ కత్తి..

ఒక్క మ్యాచ్.. 1605 రోజుల రికార్డుకు ఎండ్ కార్డ్?.. భారత్ మెడపై ఇంగ్లాండ్ కత్తి..

IND vs ENG 5th T20I: ఇంగ్లాండ్ తో ఈరోజు (శనివారం, జూలై 11న) జరిగే ఐదో టీ20 మ్యాచ్ భారత జట్టుకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. సౌతాంప్టన్‌లోని యుటిలిటా బౌల్ (Utilita Bowl) స్టేడియంలో ఇరు జట్ల మధ్య చివరి సమరం జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు 3–0తో తిరుగులేని ఆధిక్యం సంపాదించి సిరీస్ కైవసం చేసుకున్నప్పటికీ, ఈ ఆఖరి పోరు మాత్రం ఐసీసీ ర్యాంకింగ్స్ పరంగా అత్యంత కీలకంగా మారింది. 

భారత్ అగ్రస్థానానికి ఇంగ్లాండ్ ఎసరు: 
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో గత 1,605 రోజులుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా నంబర్ వన్ పీఠానికి ఇప్పుడు గండం పొంచి ఉంది. హ్యారీ బ్రూక్ సేన ఈ చివరి మ్యాచ్‌లో కూడా విజయం సాధించి భారత్‌ను క్లీన్ స్వీప్ చేస్తే, ప్రపంచ ఛాంపియన్లను వెనక్కి నెట్టి ఇంగ్లండ్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. 

సిరీస్ క్లీన్ స్వీప్ గండం: 
భారత జట్టు విదేశీ పర్యటనలో ఘోరమైన వైఫల్యాలని ఎదుర్కొంటుంది. ఫిబ్రవరి 2022 నుంచి టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా కొనసాగుతున్న టీమిండియాను తాజా సిరీస్‌లో ఇంగ్లాండ్ దారుణంగా దెబ్బకొట్టింది. ముఖ్యంగా నాటింగ్ హామ్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 125 పరుగులు, నాలుగో టీ20 మ్యాచులో 9 వికెట్ల తేడాతో ఇండియాని ఓడించింది. ఇప్పుడు సౌతాంప్టన్ వేదికగా జరిగే చివరి పోరులో కూడా ఓటమి ఎదురైతే, అది భారత్‌ను 4–0తో వైట్‌వాష్ చేయడమే కాకుండా, సుమారు నాలుగున్నరేళ్లుగా కాపాడుకుంటున్న భారత సామ్రాజ్యానికి తెరపడుతుంది. అందువల్ల ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి తమ పరువును, నంబర్ వన్ స్థానాన్ని కాపాడుకోవాలని శ్రేయస్ అయ్యర్ సేన పట్టుదలతో ఉంది. 
 
ఇరు జట్ల స్క్వాడ్స్ ఇవే: 
భారత జట్టు: కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, సూర్యాంష్ షెడ్గే, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్

ఇంగ్లాండ్ జట్టు: కెప్టెన్ హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), ఫిల్ సాల్ట్, జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్