పెద్దపల్లి జిల్లా అభివృద్ధిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. గత పాలకులు ప్రజల సొమ్మును దోచుకున్నారే తప్ప... నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. తాను నిరంతరం చేసిన పోరాటాల ఫలితంగానే కేంద్రం నుంచి పెద్దపల్లి పార్లమెంట్ పరిధికి ఏకంగా రూ. 8 వేల కోట్ల నిధులు మంజూరయ్యాయని ఆయన స్పష్టం చేశారు.
గత రెండేళ్లుగా పెద్దపల్లి సమస్యలను పార్లమెంట్‌లో గట్టిగా వినిపిస్తున్నానన్న వంశీకృష్ణ... రామగుండం-మణుగూరు రైల్వే ట్రాక్ కోసం 4 వేల కోట్లు, రైల్వే ఆర్వోబీలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీల కోసం మరో 500 కోట్లు తెచ్చినట్లు వెల్లడించారు. అలాగే ధర్మపురి నుంచి చెన్నూరు వరకు నేషనల్ హైవే-63 పనుల కోసం రూ. 2,800 కోట్లు కేటాయించామన్నారు. రూ. 150 కోట్లతో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం చర్యలు చేపట్టామని, అయితే ఈఎస్ఐ, ఎయిర్‌పోర్ట్ విషయంలో రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఇక సింగరేణి కార్మికుల పక్షాన నిలబడతామన్న ఎంపీ... రిటైర్డ్ కార్మికులకు రూ. 10,000 పెన్షన్ ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చానన్నారు. తాడిచెర్ల బొగ్గు బ్లాక్-2 ను సింగరేణికి కేటాయించడం ద్వారా సంస్థ ఆర్థికంగా బలపడుతుందని... గతంలో బొగ్గు బ్లాకులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతుంటే బీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో జై శ్రీరామ్ అంటూ రాజకీయాలు చేసే బీజేపీ నాయకులు... అయోధ్యలో రూ. 250 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దొంగతనానికి గురైతే ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. బీజేపీ మంత్రులు నీట్ పరీక్ష పత్రాలను అమ్ముకుని బతుకుతున్నారని, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను బీజేపీ అడ్డుకుంటోందని తీవ్ర విమర్శలు చేశారు. పెద్దపల్లి ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.
