రోజుకు రోజుకు భార్య బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. కొందరు భర్తలను హతమారుస్తుంటే.. మరికొందరు దాడులు చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది. డబ్బుల విషయంలో వివాదం తలెత్తడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య కోపంలో భర్తపై యాసిడ్ పోసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన భర్త ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వివరాల ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామానికి చెందిన పులపాకూరి అర్జున్ కుమార్, దుర్గా భవానీ భార్యభర్తలు. దుర్గా భవానీ ఒక ఆసుపత్రిలో కాంట్రాక్ట్ నర్సుగా పనిచేస్తున్నారు. జాబ్ పర్మనెంట్ చేయిస్తామని చెప్పి అర్జున్ బంధువులు దుర్గా భవాని దగ్గర డబ్బులు తీసుకున్నారు. కానీ జాబ్ పర్మనెంట్ చేయించలేదు. ఈ విషయంలో గత కొన్ని రోజులు అర్జున్, దుర్గా భవానీ మధ్య గొడవలు జరుగుతున్నాయి.
శుక్రవారం (జులై 10) కూడా ఇదే విషయంలో ఇరువురు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దుర్గా భవానీ భర్తపై యాసిడ్ పోసింది. ఈ దాడిలో అర్జున్ తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు అతడి వెంటనే అమలాపురం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
