లక్నో: అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ, నిధుల గోల్ మాల్ నేపథ్యంలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రక్షాళన షురూ చేసింది. ఇందులో భాగంగానే ఆలయ విరాళాల లెక్కింపుకు ట్రస్ట్ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. అయోధ్య రామ మందిరంలో ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే విరాళాలను లెక్కిస్తారు.
విరాళాలు లెక్కించే సిబ్బంది ధరించే దుస్తులకు ఎలాంటి జేబులు ఉండకూడదు. వీరంతా ప్రత్యేకమైన ముదురు నీలం రంగు యూనిఫాం మాత్రమే ధరించాలి. నగదు, విలువైన వస్తువులను ఎక్కడా దాచుకోవడానికి వీలు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, విరాళాల లెక్కింపు కౌంటింగ్ హాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులపై పూర్తిగా నిషేధం విధించారు. సిబ్బంది తమ మొబైల్ ఫోన్లు, కెమెరాలు, బ్యాగులు, ఎలాంటి వ్యక్తిగత వస్తువులను లోపలికి తీసుకెళ్లడం నిషేధం. ఇక, గతంలో మాదిరిగా టేబుల్స్, కూర్చీలపై కూర్చొని కానుకలు లెక్కించే విధానానికి ట్రస్ట్ స్వస్తి పలికింది.
ఇకపై సిబ్బంది అంతా నేలపై కూర్చొని మాత్రమే విరాళాలను లెక్కించాలి. రెండంచెల భద్రత, కఠిన నిఘా మధ్య లెక్కింపు కొనసాగుతోంది. కౌంటింగ్ హాలులోకి ప్రవేశించే ముందు సిబ్బందికి రెండంచెల భద్రతా తనిఖీలు నిర్వహిస్తారు. కౌంటింగ్ హాల్ మొత్తం నిరంతరం సీసీ టీవీ కెమెరాల నిఘాలో ఉంటుంది. అలాగే, హుండీల లెక్కింపు విధుల్లో ఉన్న సమయంలో సిబ్బంది ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదనే నిబంధనను కూడా తెచ్చారు.
ALSO READ : ఆ దేవుడికి ప్రసాదం కిచిడీ.. టమాటా, ఆలూ లేకుండా ఎందుకు వండుతారో తెలుసా
అయోధ్య రామ మందిరంలో విరాళాలు స్వాహా
పవిత్ర అయోధ్య రామాలయంలో అక్రమాలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. రామయ్యకు భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకలను కొందరు స్వాహా చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో పలువురిని విచారించిన సిట్ 8 మందిని అరెస్ట్ చేసింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అయినా అయోధ్య రామాలయంలో విరాళాలు చోరీ జరగడంతో రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రక్షాళన స్టార్ట్ చేసింది.
