చదువుడు లేదు.. పని చేసుడూ లేదు: కర్ణాటకలో 23% జెన్‌జెడ్ యూత్ పరిస్థితి ఇది..!

 చదువుడు లేదు.. పని చేసుడూ లేదు: కర్ణాటకలో 23% జెన్‌జెడ్ యూత్ పరిస్థితి ఇది..!

కర్ణాటక అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఐటీ హబ్. స్టార్టప్ ఐడియాలకు, ఉద్యోగ అవకాశాలకు కేంద్ర బిందువుగా ఉంది ఈ రాష్ట్రం. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని 35 ఏళ్లలోపు జెన్‌జెడ్ యువతలో దాదాపు 23 శాతం మంది చదువుకోవడం లేదు.. పోనీ ఉద్యోగం కూడా చేయడం లేదు. అభివృద్ధిలో అగ్రగామిగా చెప్పుకునే రాష్ట్రంలోనే ఈ పరిస్థితి బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.

‘ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్’ విడుదల చేసిన కర్ణాటక స్టేట్ హ్యాండ్‌బుక్ ఆన్ యూత్ ఆపర్చునిటీ రిపోర్ట్ ప్రకారం.. కర్ణాటక యువతలో కేవలం 42 శాతం మంది మాత్రమే జాబ్స్ చేస్తున్నారట. మరో 35 శాతం మంది చదువుకుంటూ నైపుణ్య శిక్షణలో కొనసాగుతున్నారు. ఇక మిగిలిన 23 శాతం మంది మాత్రం అటు ఉద్యోగం చేయకుండా, ఇటు చదువుకోకుండా ఇంట్లోనే ఉండిపోతున్నారు. కర్ణాటకలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా బెంగళూరు, దాని పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యాయని తేలింది. దీంతో మిగతా జిల్లాల యువత ఉద్యోగాల కోసం భారీగా బెంగళూరుకు వలస వెళ్తున్నారు. దీనివల్ల రాజధానిపై జనాభా, మౌలిక వసతుల ఒత్తిడి పెరుగుతోంది. జిల్లాల మధ్య అవకాశాల్లో తీవ్ర అసమానత కనిపిస్తోంది. బెంగళూరు అర్బన్ జిల్లా 65 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. యాదగిరి జిల్లా కేవలం 42 పాయింట్లతో వెనుకబడి ఉంది.

నిరుద్యోగం తగ్గినా సమస్యలు అలాగే..
కర్ణాటకలో నిరుద్యోగం 2017-18లో 15.8 శాతం నుంచి 2025 నాటికి 8.6 శాతానికి తగ్గింది. యువతలో వృత్తి శిక్షణ పొందిన వారి సంఖ్య కూడా 6.5 శాతం నుంచి 28.5 శాతానికి పెరిగింది. నెలవారీ వాస్తవ వేతనాలు కూడా 23 శాతం పెరిగాయి. అయినప్పటికీ ఉద్యోగ అవకాశాలు సమానంగా అందుబాటులో లేకపోవడం, నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు దొరకకపోవటం వల్ల వేలాది మంది యుూత్ ఉపాధికి దూరంగా ఉంటున్నారని తేలింది.

ఇక మహిళల విషయానికి వస్తే.. ఉచిత బస్సు ప్రయాణం కల్పించే ‘శక్తి’ పథకం అమలులో ఉన్నప్పటికీ, 31 జిల్లాల్లో 20 జిల్లాల్లో మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లే స్వేచ్ఛ ఇంకా పరిమితంగానే ఉందని రిపోర్ట్ తెలిపింది. ప్రతి నాలుగు మంది యువ గ్రాడ్యుయేట్ నిరుద్యోగుల్లో ఒకరు మహిళే. అలాగే యువతుల్లో కేవలం ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే ఉద్యోగ రంగంలో ఉన్నారు. కుటుంబ నిర్ణయాల్లో కూడా మహిళలకు పూర్తి స్వేచ్ఛ లేని జిల్లాలు డజనుకు పైగా ఉన్నట్లు తేలింది.

కర్ణాటకలో దేశంలోనే అతిపెద్ద ఐటీఐల నెట్‌వర్క్ ఉన్నప్పటికీ.. అనేక జిల్లాల్లో శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులు అర్హత పత్రాలు కూడా పొందకుండా బయటకు వస్తున్నారని నివేదిక పేర్కొంది. దాదాపు సగం ట్రైనర్ పోస్టులు ఖాళీగా ఉండగా, నమోదైన పరిశ్రమల్లో కేవలం నాలుగింట ఒకటి మాత్రమే అప్రెంటిస్ అవకాశాలు కల్పిస్తున్నాయి. 

స్థానిక ఉద్యోగాలే పరిష్కారం..
యువతకు వారి స్వంత జిల్లాల్లోనే ఉపాధి అవకాశాలు పెంచాలని, పరిశ్రమలు, చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహం ఇవ్వాలని, నైపుణ్య శిక్షణను ఉద్యోగాలతో అనుసంధానం చేయాలని నివేదిక సూచించింది. బెంగళూరుకే అన్ని అవకాశాలు పరిమితం కాకుండా ప్రతి జిల్లాలో సమాన అభివృద్ధి జరిగితేనే కర్ణాటక యువత పూర్తి స్థాయిలో ఉపాధి రంగంలోకి వస్తారని నిపుణులు అంటున్నారు. లేదంటే ఈ పరిస్థితులు రానున్న కాలంలో ఆర్థిక అసమానతలకు దారితీస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.