లోకో పైలట్ అప్రమత్తత.. మహబూబాబాద్ జిల్లాలో తృటిలో తప్పిన ఘోర రైలు ప్రమాదం

లోకో పైలట్ అప్రమత్తత.. మహబూబాబాద్ జిల్లాలో తృటిలో తప్పిన ఘోర రైలు ప్రమాదం

 

మహబూబాబాద్ జిల్లాలో ఓ ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. జులై 11న వేకువ జామున  లెవెల్ క్రాసింగ్ గేట్ నెంబర్ 75  దగ్గర  విధులు నిర్వహిస్తున్న గేట్‌మెన్  నిర్లక్ష్యం  కారణంగా రైలు వస్తున్న సమయంలో  సిగ్నల్ ఫుట్ బ్యాక్(వెనక్కి) అయింది.   వెంటనే గమనించిన లోకో పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రమాదాన్ని ముందే ఊహించిన లోకో పైలట్  అత్యంత వేగంగా వెళ్తున్న రైలుకు ఒక్కసారిగా సడెన్ బ్రేక్ వేశారు. దీంతో రైలు భారీ కుదుపుతో నిలిచిపోయింది. ఊహించని విధంగా ఒకేసారి బ్రేక్ పడటంతో రైల్లోని ప్రయాణికులంతా భయాందోళనలతో ఉలిక్కిపడ్డారు.

సమయస్ఫూర్తితో వ్యవహరించి పెద్ద ప్రమాదాన్ని తప్పించిన లోకో పైలట్‌ను ప్రయాణికులు అభినందిస్తూ ఊపిరి పీల్చుకున్నారు. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలతో ముడిపడి ఉన్న విషయంలో ఇంతటి నిర్లక్ష్యానికి పాల్పడిన గేట్‌మెన్ తీరుపై రైల్వే ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సదరు గేట్‌మెన్‌ను తక్షణమే విధులనుంచి సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.