నా తండ్రి మరణానికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటా.. ఇది దేశ ప్రజల డిమాండ్: మోజ్తాబా ఖమేనీ

నా తండ్రి మరణానికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటా.. ఇది దేశ ప్రజల డిమాండ్: మోజ్తాబా ఖమేనీ

టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మృతికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటానని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శపథం చేశాడు. తన తండ్రి అంత్యక్రియల అనంతరం తొలిసారి స్పందించిన మొజ్తబా ఖమేనీ.. ఇరాన్ ప్రజల కోరిక మేరకు తన తండ్రి రక్తాన్ని చిందించిన వారిపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటానని ప్రకటించారు. ప్రతీకారం ఇరాన్ ప్రజల సంకల్పం, డిమాండ్ అని.. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని ఆయన తేల్చిచెప్పారు. 

‘‘ఈ ప్రతీకారం మన జాతి సంకల్పం. దీనిని తప్పక అమలు చేయాలి. ప్రతీకారం తీర్చుకోవడం అనేది తన వ్యక్తిగత ఉనికిపైన గానీ లేదా ఇతర ఇరాన్ అధికారులపైన గానీ ఆధారపడి లేదు. ఎవరున్నా లేకున్నా అది తప్పకుండా జరిగి తీరుతుంది’ అని మోజ్తాబా ఖమేనీ పేరిట శనివారం (జులై 11) ఒక ప్రకటన విడుదలైంది. ఇరాన్‎తో పాటు పొరుగున ఉన్న ఇరాక్‌లో పెద్దఎత్తున తన తండ్రి అంత్యక్రియలకు హాజరైన వారికి కూడా ఈ ప్రకటనలో మోజ్తాబా ధన్యవాదాలు తెలిపారు. శత్రువుల గుండెల్లో గుబులు పుట్టే విధంగా ప్రజలు అంత్యక్రియలకు హాజరయ్యారని పేర్కొన్నారు. 

2026, ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. వివిధ కారణాలతో ఆయన అంత్యక్రియలను నాలుగు నెలల పాటు వాయిదా వేసిన ఇరాన్... జులై 4 నుంచి 9 వరకు నిర్వహించింది. తమ దేశ అగ్రనేతను కడసారి చూసేందుకు ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ ప్రజల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆరు రోజుల పాటు జరిగిన ఖమేనీ అంతిమ సంస్కారాల కార్యక్రమానికి దాదాపు 4 నుంచి 10 కోట్ల మంది హాజరైనట్లు సమాచారం. అయితే, అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడ్డ మోజ్తాబా ఖమేనీ తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనలేదు.