Health alert: ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది.. రెండు రోజుల్లో తినాల్సింది ఒక్కసారే తీసుకుంటున్నాం

Health alert: ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది.. రెండు రోజుల్లో తినాల్సింది ఒక్కసారే తీసుకుంటున్నాం

పట్టణాల్లో జీవనం.. పొద్దున లేస్తే ఉరుకులు పరుగులు. వండుకునే టైం ఎక్కడిది.. దీంతో చాలామంది  బయటి ఫుడ్ ను ఎక్కువగా ఆర్డర్ చేస్తుంటారు. ఇంకొందరు రోజు ఇంట్లో వంటేనా.. సరదాగా టేస్ట్ చేద్దామంటూ  హోటళ్లు, రెస్టారెంట్లు, వీధుల్లో దొరికే ఫుడ్ ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకొని తింటున్నారు. అయితే వ్యాపారులు వారి అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. వ్యాపారమే లక్ష్యంగా వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని పక్కనబెట్టి, రుచి, వాసన, కంటికి ఇంపుగా కనిపించేవిధంగా వారిని ఆకట్టుకునే ట్రిక్స్  చేస్తున్నారట.. అందులో భాగంగానే ఉప్పు, కలర్స్,   మసాలాలు దట్టించి విక్రయిస్తున్నారట.. అదే విషయాన్ని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. టేక్‌అవే ఫుడ్ లో మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఉప్పు ఉంటుందని ఇంగ్లాండ్ కు చెందిన రీడింగ్ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో పరీక్షించిన ఆన్ లైన్ ఆర్డర్లు, టేక్‌అవే ఫుడ్స్ లో దాదాపు 47 శాతం ఫుడ్ మెనూలో చెప్పిన దానికంటే ఎక్కువ ఉప్పు ఉన్నట్లు తేలింది. కొన్ని వంటకాల్లో ఏకంగా 10 గ్రాములకుపైగా ఉప్పు ఉన్నట్లు గుర్తించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ,భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR) మార్గదర్శకాల ప్రకారం.. ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల (సుమారు 1 టీస్పూన్) కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. అయితే, సగటు భారతీయుడు దీనికి భిన్నంగా రెట్టింపు (8 నుండి 11 గ్రాముల) ఉప్పును వినియోగిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో రోజుకు 9.2 గ్రాములు,  గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు రోజుకు 5.6 గ్రాములు వినియోగిస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. 

అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల బీపీ, గుండె జబ్బులు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు డాక్టర్లు. అలాగే శరీరంలో నీరు నిల్వ ఉండటం, వాపులు రావడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయంటున్నారు. 

మన దేశంలో బిర్యానీ, ఫ్రైడ్ రైస్, పిజ్జా, బర్గర్లు, నూడుల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, ప్యాకెట్ స్నాక్స్, పాపడ్లు, ఊరగాయలు, రెడీమేడ్ సాస్‌లు, ప్రాసెస్డ్ నాన్ వెజ్ వంటి ఆహార పదార్థాల్లో ఉప్పు ఎక్కువగా వాడుతున్నారని తేలింది.  బయట హోటళ్లలో తయారుచేసే కూరలు, గ్రేవీలు, ఫాస్ట్ ఫుడ్‌లో కూడా రుచిని పెంచేందుకు ఎక్కువ ఉప్పు వేస్తున్నారట. 

ALSO READ : వెరైటీ బజ్జీలు.. పైనాపిల్.. టమాటా .. ఉల్లితో ఇలా తయారు చేసుకోండి..

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే బయట ఆహారం తినే అలవాటును తగ్గించడం, ప్యాకెట్ ఆహారాలపై ఉన్న పోషకాహార వివరాలను చెక్ చేయడం, ఇంట్లో వండిన తాజా ఆహారానికి తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అదనంగా ఉప్పు చల్లుకుని తినే అలవాటును మానుకుంటే ఆనారోగ్య సమస్యలు దరిచేరవని చెబుతున్నారు.