Shreyas Iyer Sister: భారత టీ20 క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఎదుర్కొంటున్న వరుస పరాజయాల హీట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ తెలుస్తుంది. గ్రౌండ్ లో ప్లేయర్స్ ప్రదర్శనపై విమర్శలు వస్తున్న సమయంలో, నెట్టింట జరిగిన ఒక ఆసక్తికర పరిణామం క్రీడాలోకంలో సరికొత్త వివాదానికి దారి తీసింది. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ కొట్టిన ఒక్క లైక్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇండియా ఘోరంగా విఫలమవుతున్న తరుణంలో, తన సోదరుడిని ఉద్దేశించి ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఒక మీమ్‌ను ఆమె లైక్ చేసినట్లు ఒక స్క్రీన్‌షాట్ ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‌ఫామ్‌పై తెగ వైరల్ అవుతోంది.
10 మంది పాములతో ఆడుతున్నాడు:
సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్న ఆ స్క్రీన్‌షాట్ ప్రకారం.. శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం జట్టులో 10 మంది పాములతో ఆడుతున్నాడు (He is playing with 10 snakes) అనే క్యాప్షన్‌తో ఉన్న ఒక ఫ్యాన్-మేడ్ మీమ్‌కి శ్రేష్ఠ అయ్యర్ లైక్ చేసినట్లు కనిపిస్తోంది. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఇప్పటికే 3–0తో సిరీస్ కోల్పోవడంతో పాటు జట్టు ఎంపిక, ఆటగాళ్ల సమన్వయంపై తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో ఈ లైక్ సంచలనం సృష్టిస్తోంది. ఇది కేవలం ఒక అభిమాని పెట్టిన వ్యక్తిగత కామెంట్ అయినప్పటికీ, జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నాయా అనే కోణంలో ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే ఈ వైరల్ స్క్రీన్‌షాట్‌పై అటు శ్రేయస్ అయ్యర్ గానీ, ఇటు అతని సోదరి శ్రేష్ఠ కానీ ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు.
ఐపీఎల్‌లో కేకేఆర్‌పై వీడియో.. గతంలోనూ వివాదాల్లో శ్రేష్ఠ:
శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ కావడంతో ఆమె చేసే పోస్టులపై సోషల్ మీడియాలో ఎప్పుడూ గట్టి నిఘా పెట్టి ఉంటుంది. గతంలో ఐపీఎల్ 2026 సీజన్ సందర్భంగా కూడా ఆమె ఒక వివాదంలో చిక్కుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగిన మ్యాచ్ వర్షంతో రద్దయి, ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. అప్పడు శ్రేష్ఠ పంజాబీ భాషలో ఒక సరదా వీడియోను పోస్ట్ చేస్తూ.. పంజాబీలకు పెద్ద హృదయం ఉంటుందని, అందుకే కేకేఆర్‌కు ఒక పాయింట్ ఇచ్చారనే అర్థంలో వీడియో చేసింది. దీనిపై కేకేఆర్ ఫ్యాన్స్ సీరియస్‌గా తీసుకుని ఆమెపై విరుచుకుపడ్డారు. దాంతో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని డిలీట్ చేసింది.
హద్దులు దాటుతున్న ఫ్యాన్స్.. ఆటగాళ్ల కుటుంబాలపై ట్రోలింగ్:
ఇంగ్లాండ్ పర్యటనలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటోంది. సిరీస్ ఇప్పటికే చేజారడంతో ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దీంతో శ్రేష్ఠ అయ్యర్ సోషల్ మీడియా పోస్టులను నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. అయితే క్రికెట్ మ్యాచ్‌లలో గెలుపోటములపై విమర్శలు చేసే హక్కు అభిమానులకు ఉంది, కానీ అది ఆటగాళ్ల కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా దూషించే స్థాయికి వెళ్లడం సరికాదని క్రీడా పండితులు పేర్కొంటున్నారు.
