OTT Films Censor: ఇష్టమొచ్చిన బోల్డ్ కంటెంట్‌కు ఇక బ్రేక్.. ‘సత్లుజ్’ రచ్చతో OTTలకు సెన్సార్‌షిప్?

OTT Films Censor: ఇష్టమొచ్చిన బోల్డ్ కంటెంట్‌కు ఇక బ్రేక్.. ‘సత్లుజ్’ రచ్చతో OTTలకు సెన్సార్‌షిప్?

OTT ప్లాట్‌ఫారమ్‌ల వినియోగం బాగా పెరిగిపోయింది. గతంలో సినిమాలంటే కేవలం థియేటర్స్ మాత్రమే ఆప్షన్గా ఉండేది. కానీ ఇప్పుడు వాటికి ప్రత్యామ్నాయంగా ఓటీటీలు వచ్చేశాయి. గేమ్ షోలు, టాక్ షోలు, వెబ్ సిరీస్కు ఇలా కొత్త కొత్త కంటెంట్తో ఆడియన్స్కు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రేక్షకులు ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు.. ఓటీటీ వినియోగంలో ఎక్కువ యూత్ ఉన్నారు కాబట్టి.. వారి కోసం సెపరేట్గా బోల్డ్ కంటెంట్తో కూడుకున్న సిరీస్ లను పలు ఓటీటీ సంస్థలు రూపొందిస్తున్నాయి. ఈ పరిణామం దృష్ట్యా ఓటీటీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చే దిశగా అడుగులువేస్తోంది.

ఇకనుండి ఓటీటీలకు కూడా సెన్సార్ కట్స్ పడనున్నాయి. ఓటీటీ లకు కూడా సెన్సార్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నిబంధనలు విధించనుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లో అసభ్యకరమైన సన్నివేశాలు, డైలాగులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సెన్సార్‌ నిబంధనలు కట్టుదిట్టం చేయనుంది. ఎంతోకాలంగా ఓటీటీలకు కూడా సెన్సార్ రావాలని వినిపిస్తూనే ఉంది. కానీ అది పూర్తిగా ఆచరణలోకి రావడానికి ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ క్రమంలోనే మరోసారి OTT లకు సెన్సార్ అవసరమని చర్చ జరగడానికి ముఖ్య కారణం పంజాబీ చిత్రం ‘సత్లుజ్’ (Satluj) మూవీ వివాదం. ఓ వైపు ఓటీటీ సంస్థల మరియు ‘సత్లుజ్’ మూవీ మేకర్స్ ఉంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉంది. మరి వీరి మధ్య ఏం జరుగుతుందో ఓ లుక్కేద్దాం. 

 ‘సత్లుజ్’ వివాదం.. OTTకి సెన్సార్..

దిల్‌జిత్ దోసాంజ్ నటించిన ‘సత్లుజ్’ సినిమా వివాదం వేడెక్కింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలకు కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి ముందస్తు సర్టిఫికేషన్ తప్పనిసరి చేసేలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలో సవరణలు తీసుకురావాలని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ప్రకారం, ఈ సినిమా పంజాబ్‌లోని ఉగ్రవాద కాలానికి సంబంధించిన సున్నితమైన అంశాలను చూపిస్తోందని, ప్రజా శాంతి, భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయంపై చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 

ఇకపోతే, మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిన ఈ చిత్రం ఎన్నో సంవత్సరాల ఆలస్యం, సెన్సార్ వివాదాల అనంతరం జూలై 3న ZEE5లో విడుదలైంది. అయితే విడుదలైన 48 గంటల్లోనే భారతదేశంలో ఈ చిత్రాన్ని ప్లాట్‌ఫారమ్ నుంచి తొలగించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సినిమా అందుబాటులో ఉండదని ZEE5 ప్రకటించింది.

ఈ వివాదం ప్రస్తుతం పంజాబ్ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సినిమా తొలగింపును విమర్శిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది. మరోవైపు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ నేతృత్వంలోని శిరోమణి అకాళీ దళ్ రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో 'సట్లుజ్' ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తామని ప్రకటించింది. సిక్కు సమాజం ఎదుర్కొన్న అన్యాయాల గురించి యువతకు అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొంది.

ALSO READ :  జైలర్ విలన్ తిక్కపనులు.. సోషల్ మీడియాలో మైనర్ బాలిక ఫోటో పోస్ట్.. 

ఈ నేపథ్యంలో సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖలోని అధికారులు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో సవరణలు చేసి, ప్రజల వీక్షణకు విడుదలయ్యే ప్రతి సినిమాకు.. అది థియేటర్‌లో అయినా, నేరుగా OTTలో అయినా.. CBFC సర్టిఫికేషన్ తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.

అసలు వివాదం ఎందుకు? కథేంటి?

పంజాబ్‌లో 1984 నుండి 1994 మధ్య కాలంలో జరిగిన తీవ్రవాద అణచివేత నేపథ్యంలో... వేలాది మంది గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను పోలీసులు అక్రమంగా దహనం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ దారుణాన్ని బట్టబయలు చేసిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ హనీ ట్రెహన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గుర్తుతెలియని మృతదేహాల దహనాలు, ఎన్‌కౌంటర్లపై ఖల్రా చేసిన పరిశోధనను ఇందులో చూపించారు. కాగా, 1995లో ఖల్రా కూడా మిస్టీరియస్‌గా అదృశ్యమయ్యారు . ఆ తర్వాత ఆయన హత్యకు గురైనట్లు తేలింది. పంజాబ్ హిస్టరీలోనే అత్యంత సున్నితమైన, వివాదాస్పదమైన ఈ రియల్ స్టోరీని టచ్ చేయడమే ఈ సినిమా చుట్టూ ఇంత రచ్చ జరగడానికి కారణం.

ప్రభుత్వ వాదన ఇదే..

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని 2022లో CBFCకు పంపగా ఏకంగా 127 కట్స్ సూచించారని తెలుస్తోంది. చిత్రబృందం వాటిని అంగీకరించకపోవడంతో సర్టిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత టైటిల్‌ను 'పంజాబ్ 95' నుంచి 'సత్లుజ్'గా మార్చి నేరుగా OTTలో విడుదల చేశారు. అయితే థియేటర్లలో విడుదలకు అవసరమైన సెన్సార్ సర్టిఫికేట్ లేకపోవడం, అలాగే భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మధ్యవర్తి మార్గదర్శకాల ప్రకారం ZEE5కు సినిమాను తొలగించాలని సూచించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.