దక్షిణాది గానకోకిలగా, భారతీయ సినీ సంగీతంలో 'ఎక్స్‌ప్రెషన్ క్వీన్' గా పేరొందిన ఎస్. జానకి మధురమైన గాత్రంతో ప్రేక్షకులను మైమరించారు. ఆరేళ్ల చిన్నారి నుంచి అరవై ఏళ్ల వృద్ధురాలి పాత్రల వరకూ స్వరానుకరణతో ప్రాణం పోశారు. జానకమ్మ అని సినీ పరిశ్రమ, అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునే ఎస్.జానకి..17 భాషల్లో 48వేలకుపైగా పాటలు పాడారు. ఆమె విశిష్ట సేవలకు గాను నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నారు.
బాల్యం, తొలి అడుగులు..
ఎస్. జానకి 1938, ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి శిష్ట్ల శ్రీరామమూర్తి ఆయుర్వేద వైద్యుడు, ఉపాధ్యాయుడు. చిన్నతనంలోనే నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి దగ్గర సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు జానకి. తొమ్మిదేళ్ల వయస్సులోనే సిరిసిల్లలో తొలిసారిగా వేదికపై తన గాన ప్రతిభను ప్రదర్శించారు. తన మేనమామ ప్రోత్సాహంతో మద్రాసు చేరుకొని సినీ రంగ ప్రవేశం చేశారు.
సినీ ప్రస్థానం
1957లో తమిళ చిత్రం విధియిన్ విలయాట్టు, తెలుగు చిత్రం ఎమ్మెల్యే ద్వారా నేపథ్య గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల, పి.సుశీల వంటి దిగ్గజాలతో కలిసి పాడారు. జానకమ్మ మాతృభాష తెలుగు అయినప్పటికీ.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో ఎనలేని ప్రావీణ్యం సంపాదించారు. అధికంగా కన్నడ, మలయాళం భాషల్లో వేలాది పాటలు పాడారు.
గుర్తింపు, అవార్డులు..
నాలుగు సార్లు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డులు అందుకున్నారు జానకమ్మ. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 33కు పైగా స్టేట్ ఫిలిం అవార్డులు, మైసూర్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్, తమిళనాడు ప్రభుత్వం నుంచి 'కళైమామణి', కర్ణాటక నుంచి 'రాజ్యోత్సవ' పురస్కారాలు ఆమెను వరించాయి. 2013లో భారత ప్రభుత్వం ప్రకటించిన 'పద్మభూషణ్' అవార్డును, దక్షిణాది కళాకారులకు సరైన గుర్తింపు దక్కలేదనే కారణంతో తిరస్కరించారు. సంగీతానికి తన గాత్రంతో వన్నె తెచ్చిన జానకమ్మ.. భావితరాల గాయనీమణులకు అవకాశం ఇవ్వాలనే సదుద్దేశంతో 2017 సమయంలో పాటలకు స్వస్తి పలికారు.
