మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. హరీష్ రావును ఆనాడు వాళ్ల మామ కేసీఆరే నమ్మలేదని సెటైర్లు వేశారు. కమీషన్లు బొక్కిన సంగతి తెలిసిపోవడం వల్లే... హరీష్ రావును కేసీఆర్ పక్కనబెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమీషన్ల కక్కుర్తితో ఇప్పుడు క్రషర్లను కూడా వదలకుండా హరీష్ రావు బతుకుతున్నారని మండిపడ్డారు. ఆనాడు ఆంధ్రా సంస్థలంటూ విమర్శించిన నారాయణ, చైతన్య విద్యాసంస్థలకు ఇవాళ పాలు పోసి బతుకుతున్న నీదీ ఒక బతుకేనా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రేవంత్ .
గత బీఆర్ఎస్ హయాంలో పట్టిసీమకు ఏకంగా 105 టీఎంసీల నీటిని తరలిస్తుంటే... అప్పుడు హరీష్ రావు గాడిదలు కాశారా అంటూ సీఎం నిలదీశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు వినియోగంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు పోవని హరీష్ రావు చెప్పగలరా అని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంస్థ అయిన ఎన్డీఎస్ఏ (NDSA) కమిటీ సూచనలు పాటిస్తుంటే... కేసీఆర్ మాత్రం తన వైపు నుంచి ఒక కిలాడీల కమిటీ ఏర్పాటు చేసుకున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ కిలాడీల కమిటీలో కేసీఆర్ చైర్మన్ అయితే... హరీష్ రావు, కేటీఆర్ సభ్యులుగా ఉన్నారన్నారు.
ఈ కిలాడీల కమిటీలోకి బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా చేరారని సీఎం ఆరోపించారు. వీరిని చర్లపల్లి జైలుకు పంపితేనే... వాళ్లు చేసిన అప్పులేంటో, తప్పులేంటో జనానికి తెలుస్తుందన్నారు. ఆ గజదొంగల గుంపులో చేరొద్దని ఈటల రాజేందర్ కు సూచించారు. చేతనైతే ఈ కిలాడీ కమిటీని ఢిల్లీలోని ఎన్డీఎస్ఏ కమిటీ వద్దకు తీసుకెళ్లి, బ్యారేజీలపై మీ వాదనలను ఒప్పించాలని... వారు ఓకే చెప్తే తాము కూడా ముందుకు వెళ్తామని, అంతేకానీ తప్పుడు ప్రచారాలు చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
