గోమూత్రం తాగించి, చేతబడి చేశారు..! మాజీ MP కుటుంబంపై కోడలి సంచలన ఆరోపణలు

గోమూత్రం తాగించి, చేతబడి చేశారు..! మాజీ MP కుటుంబంపై కోడలి సంచలన ఆరోపణలు

ముంబై: శివసేన (యూబీటీ) సీనియర్ నేత, మాజీ ఎంపీ వినాయక్ రౌత్ కుటుంబంపై ఆయన కోడలు గిరిజా రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. పెళ్లి తర్వాత సంవత్సరాల పాటు మానసిక, శారీరక వేధింపులకు గురి చేశారని.. క్షుద్రపూజల కోసం తనను పదేపదే స్వయం ప్రకటిత బాబాల దగ్గరకు తీసుకెళ్లారని ఆరోపించారు.

 భర్త, అత్తమామలు తనను గోమూత్రం తాగమని బలవంతం చేశారని.. అంతేకాకుండా తన జుట్టు పీకి క్షుద్రపూజలకు ఉపయోగించారని ఆమె పేర్కొన్నారు. ఇద్దరు బాబాలు క్షుద్రపూజలకు సంబంధించిన క్రతువులు కూడా నిర్వహించారని ఆమె ఆరోపించారు. తన అత్తమామలు వ్యక్తిగత, వైవాహిక సమస్యలకు అతీంద్రియ శక్తులను కారణంగా చూపారని చెప్పారు.

హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్నప్పటికీ తనతో బలవంతంగా పలు పూజలు చేయించారని.. యాంటీ డిప్రెసెంట్స్ కూడా తీసుకోమని చెప్పారని ఆరోపించారు. ఈ మేరకు తన భర్త గితేష్ రౌత్, మామ వినాయక్ రౌత్, అత్తపై కోడలు గిరిజా రౌత్ థానే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిరిజా రౌత్ ఫిర్యాదు మేరకు ఆమె భర్త గితేష్ రౌత్, మామ వినాయక్ రౌత్, అత్త, బాబాలు ఫిరోజ్, కాజీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూఢనమ్మకాల నిరోధక, క్రిమినల్ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

 కోడలు ఆరోపణలను ఖండించిన వినాయక్ రౌత్

తన కుటుంబంపై కోడలు గిరిజా రౌత్ చేసిన ఆరోపణలను మాజీ ఎంపీ వినాయక్ రౌత్ కొట్టిపారేశారు. తన కుమారుడు, కోడలి మధ్య భరణం విషయంలో వివాదం కొనసాగుతోందని తెలిపారు. గిరిజ సుమారు రూ. 5 కోట్ల విలువైన 3BHK టెర్రస్ ఫ్లాట్, నెలకు రూ. 2 లక్షల భరణం డిమాండ్ చేశారని.. అయితే ఆ డిమాండ్లను తన కుటుంబం తిరస్కరించించడంతో తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు.

ఫిర్యాదులో పేర్కొన్న బాబాల దగ్గరకు గిరిజ వెళ్లినప్పుడు ఆమె తల్లిదండ్రులు అక్కడే ఉన్నారని.. దానికి మేం ఎలా బాధ్యులం అవుతామని ప్రశ్నించారు. గత మూడేళ్లుగా గిరిజ తన కొడుకుతో కలిసి ఉండటం లేదని ఆయన తెలిపారు. పోలీసుల దర్యాప్తు తర్వాత వాస్తవాలు ఏంటో బయటకు వస్తాయని పేర్కొన్నారు.