15వ రోజుకు నిరవధిక నిరాహార దీక్ష.. మరింత క్షీణించిన సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం

15వ రోజుకు నిరవధిక నిరాహార దీక్ష.. మరింత క్షీణించిన సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం

న్యూఢిల్లీ: ప్రముఖ విద్యావేత్త, వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం మరింత క్షీణంచింది. ఆయన చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఆదివారానికి 15వ రోజుకు చేరడంతో రక్తపోటు మరింత పడిపోయింది. దాదాపు 7 కిలోలకు పైగా బరువు తగ్గారు. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గకుండా దీక్ష కొనసాగిస్తున్నారు.

కాగా, నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలోని లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) భారీ ధర్నా చేపట్టింది. సీజేపీ ధర్నాకు మద్దతుగా ప్రముఖ విద్యావేత్త, వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. 

ఆదివారానికి (జులై 12) ఆయన దీక్ష 15వ చేరుకుంది. ఈ క్రమంలో సోనమ్ వాంగ్‎చుక్ ఆరోగ్యం మరింత క్షీణించింది. రక్తపోటు మరింత పడిపోవడంతో పాటు దాదాపు 7 కిలోలకు పైగా బరువు తగ్గారు. అయినప్పటికీ ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీక్షను అలాగే కంటిన్యూ చేస్తోండటంతో వాంగ్‎చుక్ ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. 

గాంధీనో, సినీ హీరోనో కాదు: వాంగ్‎చుక్ 

తాను ఆధునిక గాంధీనో, సినీ హీరోనో కాదని.. కేవలం ఒక సాధారణ పౌరుడిని మాత్రమేనని పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగుచుక్ అన్నారు. ప్రజలు నాయకత్వం కోసం ఇతరుల వైపు చూడకుండా.. ఎవరి జీవితాలకు వారే హీరోలు కావాలని ఆయన సూచించారు. నీట్ సహా పరీక్షలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసన ఆదివారం నాటికి 23వ రోజుకు చేరుకుంది.

అందులో భాగంగా వాంగ్చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 15వ రోజుకు చేరింది. ఈ క్రమంలో వాంగ్ చుక్ ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్ట్ పెట్టారు. 'చాలామంది నన్ను 21వ శతాబ్దపు గాంధీ, మరికొందరు హీరో అని పిలుస్తున్నారు. అలా పిలవొద్దు. నేను కేవలం నా బాధ్యతలను నెరవేర్చడానికి ప్రయత్నించిన ఒక సామాన్యుడిని' అని అన్నారు.