ఉత్తరప్రదేశ్ లోని హాపుర్‌లో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. సీలు వేసి ఉన్న తాగునీటి బాటిల్ అనుకుని... ఓ మహిళ యాసిడ్ తాగిన ఘటన కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక జ్యువెలరీ షాపులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ మహిళ వాటర్ బాటిల్ తెరిచి ఒక గుటక వేయగానే... ఒక్కసారిగా తీవ్రమైన మంట, నొప్పితో బయటకు పరుగులు తీసింది. నోట్లోని ఆసిడ్ ను బయటకు ఉమ్మేస్తూ ఆమె తల్లడిల్లిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
బాధిత మహిళ ఆ వాటర్ బాటిల్‌ను ఒక స్థానిక స్వీట్ షాప్ నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ షాపు యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాదు, ఆ దుకాణం నుంచి మరికొన్ని యాసిడ్ బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
అసలు సీలు వేసి ఉన్న తాగునీటి బాటిల్‌లోకి యాసిడ్ ఎలా వచ్చింది? ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మహిళ స్థానిక మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
