ప్రభుత్వ అనుమతి లేకుండా బైక్ ట్యాక్సీలు: ర్యాపిడో వ్యవస్థాపకులపై బుక్కైన కేసు!

ప్రభుత్వ అనుమతి లేకుండా బైక్ ట్యాక్సీలు: ర్యాపిడో వ్యవస్థాపకులపై  బుక్కైన  కేసు!

ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్లు లేకుండా మహారాష్ట్రలో పెట్రోల్ బైక్ ట్యాక్సీ సేవలు నడుపుతున్నందుకు రాపిడో (Rapido) యాప్ వ్యవస్థాపకులపై నాగ్‌పూర్‌లో కేసు నమోదైంది.నాగ్‌పూర్ సిటీ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ విశాల్ మధుకరరావు ఇచ్చిన ఫిర్యాదుతో సీతాబుల్ది పోలీసులు చర్య తీసుకున్నారు. రాపిడో మాతృసంస్థ అయిన 'రూపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్' వ్యవస్థాపకులు రిషికేష్ ఎస్ఆర్, పవన్ గుంటుపల్లి, అరవింద్ శంకలపై ఈ కేసు బుకైంది.

అసలేం జరిగిందంటే.. జూన్ 23న ఆర్టీఓ అధికారులు అక్రమ రవాణాపై అకస్మాత్తుగా తనిఖీలు (స్పెషల్ డ్రైవ్) చేపట్టారు.

ఆ సమయంలో రవి భవన్ నుండి ప్రియదర్శిని కాలనీకి కేవలం రూ.22లకే రాపిడో యాప్ ద్వారా ఒక బైక్ రైడ్‌ను బుక్ చేశారు.
బుక్ చేసిన బైక్ అక్కడికి రాగానే, అధికారులు దాన్ని ఆపి చెక్ చేశారు.

ఎలాంటి లైసెన్స్ గానీ, కమర్షియల్ పర్మిట్ గానీ లేకుండా ఒక ప్రైవేట్ బైక్‌ను ట్యాక్సీగా వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో ఆ బైక్‌ను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

అధికారుల చెప్తున్నది ఏంటంటే...

రాపిడో సంస్థ మహారాష్ట్ర ప్రభుత్వం నుండి గానీ, రవాణా శాఖ నుండి గానీ పెట్రోల్ బైక్ ట్యాక్సీలు నడపడానికి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. నిబంధనలను ఉల్లంఘిస్తూ, ప్రయాణికుల భద్రతను గాలికొదిలేసి, ప్రభుత్వానికి పన్నుల రూపంలో నష్టం కలిగిస్తూ ప్రైవేట్ వాహనాలతో ఈ బిజినెస్ రన్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రస్తుతం కొత్త చట్టం అయిన భారతీయ న్యాయ సంహిత (BNS) తో పాటు మోటార్ వాహనాల చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.