స్మశానంలో దొంగతనం.. ఐదు ఆత్మల వేట.. ఓటీటీలోకి వచ్చేసిన హారర్ కామెడీ 'కరక్కం'!

స్మశానంలో దొంగతనం.. ఐదు ఆత్మల వేట.. ఓటీటీలోకి వచ్చేసిన హారర్ కామెడీ 'కరక్కం'!

మలయాళ చిత్రాలంటేనే వైవిధ్యమైన కథలు, సహజత్వానికి మారుపేరు. అందుకే తెలుగు ప్రేక్షకులు కూడా మాలీవుడ్ సినిమాలను ఓటీటీల్లో ఎగబడి చూస్తున్నారు. ముఖ్యంగా సస్పెన్స్, ఊహించని మలుపులతో సాగే హారర్ చిత్రాలకు  విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన సరికొత్త మలయాళ మ్యూజికల్ హారర్ కామెడీ డ్రామా'కరక్కం' (Karakkam) ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ (Sony LIV) లో జూలై 3 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఇది అందుబాటులో ఉంది.

కథేంటంటే?
ధనుష్ (శ్రీనాథ్ భాసి) పెద్దగా సంపాదన లేని ఒక డాన్సర్. ఇంట్లో వాళ్ళ మాటలు పడలేక ఇబ్బంది పడుతుంటాడు. అతని ప్రేమికురాలు పింకీ (ఫెమీనా జార్జ్) మాత్రమే అతనికి అండగా ఉంటుంది. ఈ క్రమంలో ధనుష్‌కు ఖాజా (ప్రవీణ్) అనే వ్యక్తి పరిచయమవుతాడు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా వీరిద్దరూ బాగా మద్యం సేవించి, మత్తులో ఒక స్మశానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు సమాధులపై ఉన్న ఐదు ఇత్తడి సిలువలను దొంగిలిస్తారు. ఆ హడావుడిలో ధనుష్ తన రూమ్ కీని అక్కడే పోగొట్టుకుంటాడు.

►ALSO READ | జానకి మరణం భారతీయ సంగీత ప్రపంచానికి పూడ్చలేని లోటు: సీఎం విజయ్

ఆ తర్వాత వారు దొంగిలించిన సిలువలను కొనే వ్యక్తి ఆకస్మికంగా చనిపోతాడు. మరోవైపు, పోగొట్టుకున్న కీ కోసం మళ్లీ స్మశానానికి వెళ్లిన వీరికి అక్కడ పోలీసులు కనిపిస్తారు. అదే సమయంలో, సమాధులపై సిలువలు దొంగిలించిన వారిని ప్రేతాత్మలు వదలవని చర్చి ఫాదర్ చెప్పడంతో ధనుష్, ఖాజాల్లో వణుకు మొదలవుతుంది. అన్నట్టుగానే, ఐదు ఆత్మలు వీరిని వెంటాడటం ప్రారంభిస్తాయి. అసలు ఆ ఆత్మల నేపథ్యం ఏంటి? అవి వీరిని ఎందుకు వేధిస్తున్నాయి? ఈ ప్రమాదం నుండి ధనుష్ ఎలా బయటపడ్డాడు? అనేదే మిగిలిన ఆసక్తికరమైన కథ.

సుభాష్ లలిత సుబ్రహ్మణ్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనాథ్ భాసి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో ఆకట్టుకున్నారు. .'ఖైదీ', 'విక్రమ్ వేద' ఫేమ్ శ్యామ్ సీఎస్ అందించిన అద్భుతమైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ హారర్ కామెడీకి ప్రాణం పోశాయి. సరికొత్త మ్యూజికల్ కాన్సెప్ట్‌తో భయపెడుతూనే నవ్వించే ఈ'కరక్కం' సినిమాను ఈ వీకెండ్‌లో సోనీ లివ్‌లో మిస్ అవ్వకండి..