ఆధ్యాత్మికం: గురువుస్థానంలో ఉండేవారు జాగ్రత్త వహించాలి..సమాజంలో ఉన్నత స్థానంలోని వారి ప్రవర్తన ఎలా ఉండాలంటే..!

ఆధ్యాత్మికం: గురువుస్థానంలో ఉండేవారు  జాగ్రత్త వహించాలి..సమాజంలో ఉన్నత స్థానంలోని వారి ప్రవర్తన ఎలా ఉండాలంటే..!

యద్యచారతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే

ఉత్తమ పురుషులు చేసే పనులనే సామాన్యులు ఆచరిస్తారు. వారినే ప్రమాణంగా గ్రహిస్తారని భగవద్గీత చెప్తోంది. సాక్షాత్తు శ్రీకృష్ణుడు.. ‘ముల్లోకాలలో నేను చేయవలసిందేమీ లేదు, సాధించదగినదీ, సాధించవలసినదీ లేదు. అయినా నేను కర్మను విడిచి పెట్టను. ఒకవేళ నేను కర్మను విడిచిపెట్టాననుకో, అసంఖ్యాక జనం నన్నే అనుసరించి సోమరులవుతారు. ఆ కారణంగా లోకనాశనం తప్పదు’ అని స్వయంగా పలికాడు.

అజ్ఞానంతో ఉన్నవాడు తను చేసిన పనికి ప్రతిఫలాన్ని ఆశిస్తాడు. అదే జ్ఞాని అయినవాడు ప్రతిఫలం ఆశించకుండా లోక క్షేమం కోసం పని చేసి తీరతాడు. జనక మహరాజు వంటి రాజర్షులు వారు చేయవలసిన కర్మను అంటే పనులను నిరంతరం విడిచిపెట్టకుండా ఆచరించి, ఆత్మసిద్ధిని అందుకున్నారు. 

 (ఉషశ్రీ భగవద్గీత నుంచి)జనక మహారాజు రాజ్యంలో ఉండే సామాన్య ప్రజలు సైతం వారు చేయవలసిన ధర్మబద్ధమైన పనులకు దూరం కాకుండా, వాటి మీదే మనసు నిలిపి ఉంచటమే జనక మహారాజు లక్ష్యం. పరిపాలకులు సత్యమార్గంలో నడిస్తే, ప్రజలు కూడా సత్యమార్గంలోనే నడిచితీరతారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న నాయకులు – గురువులు – మార్గదర్శకులు.. ఆదర్శవంతమైన, బాధ్యతాయుతమైన ప్రవర్తనను కలిగి ఉండాలి. 

మానవులు ప్రధానంగా అనుకరణ స్వభావులు. ఇతరులను చూసి అనుకరించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ప్రజలంతా పరిపాలకులను, శిష్యులు గురువులను, పిల్లలు పెద్దలను అనుసరిస్తారు. ‘శ్రేష్ఠులైనవారు చేస్తున్నారు కనుక అది సరి అయినది అయి ఉంటుంది’ అని దానిని ఆచరణకు స్వీకరిస్తారు. పెంపుడు జంతువులు.. తమ యజమానిని అనుకరిస్తాయి. ఏది చెప్తే అది చేస్తాయి. అలా అవి మానవులను అనుకరించి తదుపరి జన్మల్లో మానవ జన్మలెత్తుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. 

‘యథా రాజా తథా ప్రజా’ ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అని సామెతలు అందరికీ తెలిసినవే. ఒక గొర్రె ఎటు నడిస్తే, మిగిలిన గొర్రెలన్నీ దాని వెనుకే నడుస్తాయి.. అని కూడా తెలిసిందే. అజ్ఞానులైన మార్గదర్శకులు చేసే పని వల్ల, అతడిని అనుసరించేవారంతా గొర్రెలలాగే ప్రవర్తిస్తారు.
  
పెద్దవాళ్లే తప్పు చేస్తే, పిల్లలు ఆ తప్పును అనుకరించకుండా ఎలా ఉంటారు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తారు. అనగనగా ఒక ఊరిలో ఒక అజ్ఞాని ఉన్నాడు. తనను తాను గొప్పవాడు అనుకున్నాడు. ఒకసారి ఒక రాగి చెంబు తీసుకుని గంగా తీరానికి స్నానానికి వెళ్లాడు. చెంబును గట్టు మీద ఉంచి స్నానం చేయాలనుకున్నాడు. 

►ALSO READ | దేవాలయానికి వెళితే ఆందోళన తగ్గి.. మనశ్శాంతికి కారణం ఏమిటి.. ఆధ్యాత్మిక రహస్యం ఇదే..!

చెంబును గట్టున పెట్టినప్పుడు ఎవరైనా ఎత్తుకుపోతే ఎలా? అని ఆలోచన చేసి, ఆ చెంబుని ఒడ్డున ఇసుకలో పాతిపెట్టి, పై భాగాన్ని ఇసుకతో శివలింగాకృతితో చేసి, స్నానానికి నదిలోకి దిగాడు. మూడు మునకలు వేసి ఒడ్డుకు వచ్చి చూసేసరికి, అక్కడ వందల సంఖ్యలో శివలింగాలు కనిపించాయి. తాను అలా చెంబును ఒడ్డున పాతిపెట్టడం చూసిన అక్కడివారు, ‘స్నానం చేయడానికి ముందు ఇలా చేయాలేమో’ అనుకుని అతడిని అనుసరించారు. 

ఆ అజ్ఞాని ఎందుకు అలా చేశాడో ఆలోచించకుండా, అతడు చేసినట్లే చేయాలేమో అని భావించారు. ‘శాస్త్ర ప్రామాణికంగా చెప్పినవాటిని మాత్రమే ఆచరించాలి’ అని భగవద్గీత చెప్పినదానిని అనుసరించకుండా, అయోగ్యులు చెప్పిన అంశాలను, అజ్ఞానులు అనుసరించిన మార్గాన్ని అనుసరించడం వల్ల ఏమాత్రం మేలు చేకూరదు. శాస్త్రం చెప్పిన విధివిధానాలనే శాస్త్రప్రమాణంగా ఆచరించాలని చెప్తారు పెద్దలు. రామాయణంలో రాముడు సత్యానికి, ధర్మానికి కట్టుబడి, శాస్త్ర వచనాలను అనుసరించడం వల్లే నేటికీ రాముడు మనకు ఆదర్శప్రాయంగా నిలబడ్డాడు. రాముడు అనుసరించిన మార్గం నిత్యం అనుకరణీయం.

- డా. పురాణపండ వైజయంతి-

గమనిక: మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు
featureseditor@v6velugu.com కి మెయిల్​ చేయండి.